Ganesh Visarjan 2024 Rules : సాధారణంగా గణపతిని బేసి సంఖ్య రోజుల్లో నిమజ్జనం చేస్తాం. అంటే.. మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు.. రోజుల్లో నిమజ్జన వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఇప్పటికే లంబోదరుడి నిమజ్జనోత్సవాలు మొదలయ్యాయి. అయితే, గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయట. వాటి ప్రకారం గణపతి నిమజ్జనం చేస్తే.. లంబోదరుడి(Lord Ganesha)సంపూర్ణ అనుగ్రహంతో ఏడాదంతా శుభ ఫలితాలు పొందుతారంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. మరి, వినాయకుడి నిమజ్జనోత్సవం వేళ పాటించాల్సిన ఆ ప్రత్యేక నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రత్యేకమైన పూజ నిర్వహించాలి :మీరు గణపతిని ఎప్పుడు నిమజ్జనం చేసినా దానికి ముందు ప్రత్యేకమైన పూజ నిర్వహించాలంటున్నారు. ఆ సమయంలో గణపతి విగ్రహానికి ఉత్తరం దిక్కు వైపు కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలట. నిమజ్జనానికి ముందు విగ్రహాం దగ్గర దీపారాధన చేసి, పుష్పాలు సమర్పించి, అగరబత్తీలు వెలిగించి, ధూపం వేసి.. నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి లంబోదరుడిని నిమజ్జనం చేస్తే ఆయన సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందంటున్నారు.
ఈ మూట గణేష్ వద్ద తప్పనిసరిగా ఉండాలి : గణేష్ నిమజ్జనానికి వెళ్లడానికి ముందు ఒక ప్రత్యేకమైన మూటను వినాయకుడి విగ్రహం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ మూట ఏంటంటే.. ఒక తెల్లని వస్త్రంలో కొంచం పెరుగు, కొన్ని అటుకులు, మోదకాలు, 5 కొబ్బరికాయలను మూటలాగా కట్టి దాన్ని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆ మూటతోపాటు గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లాలి. అప్పుడే మీకు గణేషుడి ఆశీస్సులు ఉంటాయంటున్నారు.
ఈ మూట వెనుక దాగి ఉన్న అర్థమేంటంటే.. కైలాసానికి వెళ్లేటటువంటి గణపతి ఆ మూటలో ఉన్న పదార్థాలు ప్రసాదంగా స్వీకరించి తృప్తి చెందుతాడట. అందుకే.. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహంతోపాటు ఈ మూట కూడా నిమజ్జనం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్.
అదేవిధంగా గణేష్ విగ్రహాన్ని సాధ్యమైనంత వరకూ కుటుంబసభ్యులందరూ కలిసి నిమజ్జనం చేస్తే మంచిదట. లేదంటే.. ఇంటి యాజమాని నిమజ్జనం చేసినా అనుకూల ఫలితాలు కలుగుతాయంటున్నారు. అంతేకాదు.. నిమజ్జనం టైమ్లో గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ముందు హారతి ఇచ్చి నిమజ్జనం చేయాలట.