Panchmukhi Hanuman Temple Karachi: రామభక్త హనుమాన్‌కి మన దేశమంతటా గ్రామానికో గుడి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో సుప్రసిద్ధ ఆంజనేయస్వామి దేవాలయాలు తేజరిల్లుతున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. అయితే.. పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఎంతో సుప్రసిద్ధ ఆలయం ఉంది. హనుమంతుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం.. కరాచీలో ఉంది. మరి, ఆ టెంపుల్ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీరాముడికి సేవ చేసుకుంటూ తన జన్మని చరితార్థం చేసుకున్న కారణ జన్ముడు ఆంజనేయుడు. రామ భక్తికి నిజమైన ప్రతిరూపం.. నిలువెత్తు నిదర్శనం ఆంజనేయ స్వామి. శ్రీమద్ రామాయణంలో తన కోసం కాకుండా.. పరుల కోసం ఎన్నో హితకరమైన కార్యక్రమాలను నిర్వహించి.. ఆనందాంజనేయునిగా, అభయాంజనేయునిగా విఖ్యాతిగాంచాడు. అలాంటి మారుతి పుణ్యక్షేత్రం కరాచీలో అలరారుతోంది.
రాముడు దర్శించిన క్షేత్రం!
వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక పురాణాలు చెబుతున్నాయి. పాక్‌లోని హిందువులు ప్రతీ సంవత్సరం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ మందిరం 1500 ఏళ్ల క్రితం నిర్మించినట్టు కనుగొన్నారు.
ఆదర్శనీయమైన వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వాల సమ్మేళనం ఆంజనేయ స్వామి స్వరూపం. అలాంటి వ్యక్తిత్వం అలవర్చుకోవాలని మంగళ, శనివారాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శిస్తారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి కాసేపు గుడిలో సేదతీరుతారు. ఆలయ ప్రాంగణంలోకి కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అక్కడి భక్తులు ఆనందంగా చెబుతుంటారు.
స్వయంభువుగా వెలసిన స్వామి..
శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు స్థల పురాణం. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, హయగ్రీవ, ఆదివరాహ, గరుడ ముఖాలతో ఎనిమిది అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కొన్ని సంవత్సరాల క్రితం దేవాలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన తవ్వకాల్లో.. పురాతనమైన అనేక విగ్రహాలు కూడా బయటపడ్డాయి. వీటిని గుడి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. వందల ఏళ్లుగా భక్తులు అచంచల విశ్వాసంతో కరాచీలోని ఈ పంచముఖ హనుమాన్ను నిష్ఠతో పూజిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
"న్యూ ఇయర్ రోజున ఈ మంత్రాలు చదివితే - ఏడాదంతా అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే"!
"నిద్ర లేవగానే ఇలా చేస్తే అదృష్టం - మీ దశ మొత్తం తిరుగుతుంది!"