Vaikunta Ekadashi 2025 Pooja Vidhanam: హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి తిథి మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి విష్ణు మూర్తి దర్శనం లభిస్తుంది. ఇలా ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతుంటారు. మరి ఈ ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి కాబట్టి.. ఆ రోజున పూజ ఏ విధంగా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారని అంటున్నారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. సమస్త కోర్కెలు తీర్చి, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయని చెబుతున్నారు.
పూజా విధానం: వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలని చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు మూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తూ పూజ చేస్తే సంవత్సరం మొత్తం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేష ఫలితాలు లభిస్తాయని, మోక్షం సిద్ధిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఇంట్లో పూజా ఎలా చేయాలంటే
- ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని పూలతో అలంకరించుకోవాలి.
- ఆ తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. లక్ష్మీ నారాయణుల ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి ఇలా విష్ణు రూపాలకు సంబంధించిన ప్రతిమలను పూజించవచ్చని చెబుతున్నారు.
- ఆ తర్వాత ఫొటో ఎదురుగా వెండి లేదా మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలని చెబుతున్నారు.
- ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్దనం, తుమ్మి పూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలని వివరిస్తున్నారు. పూలతో పూజించేటప్పుడు "ఓం నమో నారాయణాయ", "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలంటున్నారు.
- దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి.
- ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
- ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా, విన్నా సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, మోక్షానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.