తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 9:29 PM IST

ETV Bharat / politics

దేశంలోనే అతిపెద్ద లోక్​సభ నియోజకవర్గం ఎవరి సొంతం? - మల్కాజిగిరి స్థానంలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ - Parties on malkajgiri MP seat

Political Parties Focus On Malkajgiri MP Seat : మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం కావడంతో ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టినవారవుతారు. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు మల్కాజిగిరి పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థానిక సమస్యలతో పాటు, అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు.

parliament elections 2024
Political Parties Focus On Malkajgiri MP Seat (ETV Bharat)

Political Leaders on Malkajgiri Parliament Seat :మినీ ఇండియాగా భావించే మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముమ్మర ప్రచారం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్​ఎస్ ​అభ్యర్థులు వాడవాడలా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయా పార్టీల అగ్రనేతలు సైతం ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో పర్యటించి తమ అభ్యర్థికే ఓటేయాలని విన్నవించారు. అభ్యర్థులు సైతం ప్రధానంగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతామనే విషయాలను ఓటర్లకు వివరిస్తున్నారు.

సెంటిమెంట్‌తో సీఎం రేవంత్​ ప్రచారం :అధికార కాంగ్రెస్‌ అభివృద్ది మంత్రం జపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్​ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, 10 లక్షల ఆరోగ్య బీమా గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి, ఓటర్లను సెంటిమెంట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ కుట్రలు పన్ని కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిస్తే, మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించి రాజకీయన పునర్జన్మ ఇచ్చారని రేవంత్ తన ప్రసంగంలో తరచూ ప్రస్తావిస్తున్నారు.

మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ప్రజలు అందించిన ప్రోత్సాహంతోనే గత ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి పీసీసీ అధ్యక్షుడిగా ఆ తర్వాత సీఎంగా అయ్యాయనని రేవంత్​రెడ్డి చెబుతున్నారు. అతిపెద్ద మల్కాజిగిరి నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్యక్ష్యం చేశారని, కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సునీతా మహేందర్​రెడ్డిని గెలిపిస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తానని సీఎం హామీ ఇస్తున్నారు.

గెలుపే దిశగా బీజేపీ ముమ్మర ప్రచారం :బీజేపీ నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్, తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకొని ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తిని తనేనని, మొదట్నుంచి ఉద్యమంలో కీలకపాత్ర పోషించానని ఈటల చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన తన గురించి ప్రతి ఓటర్‌కూ తెలుసని, మల్కాజిగిరి లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులెవరో కూడా ప్రజలకు తెలియదని ఈటల అంటున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని, మల్కాజిగిరిలోనూ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఈటల రాజేందర్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్, బీఆర్​ఎస్​లపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈటల గెలుపు ఖాయమైపోయిందని జేపీ నడ్డా తన ప్రసంగంలో అన్నారు.

అభివృద్ధే ఎజెండాగా బీఆర్​ఎస్​ ఎలక్షన్​ క్యాంపెయిన్​ :బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి స్థానికతను ఉపయోగించుకుంటున్నారు. బీఆర్​ఎస్​ హయాంలోనే మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మెట్రో, ఫ్లైఓవర్‌లు, రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు అందించిందని లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు.

తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఐటీ కంపెనీలు సైతం ఈ ప్రాంతంలో నెలకొల్పామని ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్​ఎస్​ నేతలు చెబుతున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ ​గెలుపొందింది. ఎమ్మెల్యేలందరూ రాగిడి లక్ష్మారెడ్డి తరఫున ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్​పైనే ప్రధాన పార్టీల గురి : 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన మల్కాజిగిరి పార్లమెంట్​లో కాంగ్రెస్ బోణి కొట్టింది. ఆ తర్వాత 2014లో టీడీపీ, 2019లో కాంగ్రెస్ గెలుపొందాయి. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్​ఎస్​, బీజేపీ ఖాతా తెరవలేదు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరు గెలుపొందినా తొలిసారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన వాళ్లవుతారు. దాదాపు 2 దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఈటల రాజేందర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు. బీజేపీ నుంచి టికెట్ దక్కించుకొని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా ఎంతో పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సునీత కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. బీఆర్​ఎస్ ​నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన లక్ష్మారెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్​ఎస్​లో చేరారు. ఎమ్మెల్యేల బలంతో ఎంపీగా గెలుపొందుతాననే ధీమాలో లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టాలని ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్​లో ఎలక్షన్ హీట్ - అభ్యర్థులకు మద్దతుగా జాతీయ నాయకుల ప్రచారం - Election Campaign In Mahabubnagar

ఉద్యమాల ఖిల్లాపై ఏ జెండా ఎగురుతుందో? - భయ్యా ఈసారి ఫైట్​ మాత్రం వెరీ టఫ్ - Karimnagar Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details