Cricket Matches Stopped Strange Reasons : భారత్ ఆడుతున్న మ్యాచ్ రద్దయితే వచ్చే చిరాకు, మ్యాచ్ ఓడిపోతే కలిగే బాధ అంతా ఇంతా కాదు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లకు ఎక్కువగా వర్షం అంతరాయం కలిగిస్తుంటుంది. స్టేడియంలో లైట్, పిచ్ కండిషన్ సక్రమంగా లేని కారణాలతోనూ మ్యాచ్ రద్దు చేస్తుంటారు. కానీ, క్రికెట్ చరిత్రలో కొన్ని విచిత్ర కారణాలతో కూడా మ్యాచ్‌లకు బ్రేక్ పడింది. అలాంటి 7 ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- విషపూరిత పొగమంచు : 2017 డిసెంబరు దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్- శ్రీలంక టెస్టు మ్యాచ్ ప్రమాదకర స్థాయి కాలుష్యం కారణంగా అంతరాయం ఎదుర్కొంది. శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో మాస్క్‌లు ధరించారు. లాహిరు గమగే, సురంగ లక్మల్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం వల్ల అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో దిల్లీలో వైద్యులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పాఠశాలలు కొన్ని రోజుల పాటు మూసివేశారు. విషపూరిత పొగమంచు కారణంగా అంతరాయం కలిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
- ఎగిరే చీమలు (Flying Ants) : సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో భారత్- దక్షిణాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎగిరే చీమలు మైదానంలోకి చొరబడి గందరగోళం సృష్టించాయి. ఫ్లడ్‌లైట్‌లను చుట్టుముట్టాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్ల హెల్మెట్‌లలోకి కూడా ప్రవేశించాయి. కొన్ని చీమలు పిచ్‌పైకి రాగానే, ఆటగాళ్ల భద్రత కోసం అంపైర్లు ఆటను నిలిపివేశారు. 30 నిమిషాల తర్వాత ఆట పునఃప్రారంభమైంది.
- సంపూర్ణ సూర్యగ్రహణం : సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా 1980లో ముంబయిలో భారత్ -ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం ఎదురైంది.
- ఫుడ్ డెలివరీ వల్ల : దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హలాల్ ఫుడ్ డెలివరీ ఆలస్యం కావడం వల్ల కూడా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. బంగ్లా క్యాటరర్లకు వెళ్లిన మెనూలో పొరపాటు జరగడం వల్ల ఆలస్యం అయ్యింది. రెండో సెషన్‌లో మ్యాచ్ 10 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ఆ తర్వాత సెషన్‌లలో 10 నిమిషాలు పొడిగించారు.
- కమ్మేసిన మేఘాలు : 2023 వన్డే ప్రపంచ కప్‌లో ధర్మశాలలో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ సమయంలో మేఘాలు తక్కువ ఎత్తులోకి వచ్చాయి. మేఘాలు చాలా దట్టంగా ఉండటంతో కాంతి తగ్గిపోయింది. దీంతో బ్రేక్ పడిన మ్యాచ్ కొంత సేపటికి తిరిగి ప్రారంభమైంది.
- సన్‌లైట్ బ్లైండింగ్ : 2019లో నేపియర్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వన్డే సూర్యకాంతి కారణంగా ఆలస్యమైంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, దాని ప్రత్యక్ష కిరణాలు భారత బ్యాటర్ శిఖర్ ధావన్‌ను కళ్లపై పడ్డాయి. దీంతో అతడు బంతిని చూడలేకపోయాడు. సూర్యకాంతి తీవ్రత తగ్గిన తర్వాత, 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది.
- తేనెటీగల దాడి : వాండరర్స్ స్టేడియంలో 2017లో దక్షిణాఫ్రికా- శ్రీలంక మధ్య జరిగిన పింక్ వన్డేకి తేనెటీగల దాడి వల్ల అంతరాయం కలిగింది. ఆటగాళ్లు వాటి నుంచి తప్పించుకునేందుకు మైదానంలో బోర్లా పడుకున్నారు. గ్రౌండ్ సిబ్బంది తేనెటీగలను తరిమేందుకు వాక్యూమ్ క్లీనర్లు, పురుగు మందులు ఉపయోగించారు. ఈ దాడి కారణంగా మ్యాచ్ గంటపాటు ఆలస్యమైంది. ఆసక్తికరంగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌లో అదే రెండు జట్లు తలపడినప్పుడు ఇలాంటి ఘటన జరిగింది.
క్రికెటర్స్ సాల్ట్, పెప్పర్, ఆనియన్స్, మస్టర్డ్- ఇవేం పేర్లురా బాబు!