Ibrahim Zadran Champions Trophy Record : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జాద్రాన్ 177 పరుగులు బాది సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్, గడాఫీ స్టేడియంలో ఫిబ్రవరి 26న బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 146 బంతుల్లో 177 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ చేసిన 165 పరుగుల రికార్డును అధిగమించాడు.
పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు
- 1996లో రావల్పిండిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ 188 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
- 1987లో కరాచీలో శ్రీలంకపై వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 181 పరుగులు చేశాడు.
- 2023 రావల్పిండిలో న్యూజిలాండ్‌పై పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 180 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- 2025 లాహోరలో ఇంగ్లండ్‌పై ఆఫ్ఠాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 177 రన్స్ కొట్టాడు.
- 2025 లాహోర్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ 165 స్కోర్ చేశాడు.
- 1996 రావల్పిండిలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఆండ్రూ హడ్సన్ 161 పరుగులు చేశాడు.
ఆఫ్గానిస్థాన్ భారీ స్కోరు
తొలుత టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. దీంతో అఫ్గానిస్థాన్ 37/3తో కుప్పకూలింది. తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా హష్మతుల్లా షాహిదీ, ఇబ్రహీం జద్రాన్ నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 40(67)కి వెనుదిరిగాడు. ఆ తర్వాత అజ్ముతుల్లా 41(31), నబీ 40(24) మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్‌లో మొదటి బంతికి జాద్రాన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.
సెమీస్ అవకాశం ఎవరికి?
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బీలో ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్ ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఓడిపోయిన జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది.