Padmavathi Brahmotsavam Hamsa Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా హంస వాహన సేవ విశిష్టత తెలుసుకుందాం.
స్నపన తిరుమంజనం
అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు హంస వాహనంపై ఊరేగనున్నారు. అంతకు ముందు అమ్మవారికి ఆలయ మంటపంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరుగుతుంది. స్నపన తిరుమంజనం ఉత్సవంలో ఉత్సవమూర్తులకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
హంస వాహన సేవ విశిష్టత
శుక్రవారం రాత్రి అమ్మవారు హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో తిరు మాడ విధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగే అపురూపమైన శక్తి కలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. అమ్మవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తుందని విశ్వాసం.
అహంకారం నాశనం
హంస వాహనంపై ఊరేగే సిరుల తల్లిని దర్శిస్తే అహంకారం పటాపంచలై పోతుంది. ఎలాగైతే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందో అలాగే ఏది మంచో, ఏది చెడో గ్రహించగల విచక్షణ మానవాళికి అమ్మవారు అనుగ్రహిస్తుంది శాస్త్రవచనం. అదే హంస వాహన సేవ యొక్క పరమార్ధం. ఇది గ్రహించడమే మన జీవితానికి పరమార్థం. మనందరికీ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ హంస వాహనంపై ఊరేగే శ్రీ పద్మావతి దేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.