Pregnancy Fatigue Reduce Tips : సాధారణంగానే కొందరు మహిళలు ఇంటి పనులు, రోజువారీ ఇతర పనుల కారణంగా తరచూ అలసటకు గురవుతుంటారు. ఇక ప్రెగ్నెన్సీ టైమ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది గర్భిణులు తరచూ అలసట సమస్యతో సతమతమవుతుంటారు. అసలు, గర్భిణుల్లో అలసట సమస్య తలెత్తడానికి కారణాలేంటి? ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? దాని నుంచి బయట పడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయ్యాక తొలినెలల్లో వారి శరీరం గర్భధారణకు అనుగుణంగా మారటానికి ప్రయత్నిస్తుంది. పిండం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అందుకోసం చాలా శక్తి ఖర్చు అవుతుంది. హార్మోన్ల మార్పులతో ఒక వైపు నిద్ర ముంచుకొస్తుంది. ముఖ్యంగా ప్రొజెస్టిరాన్ మోతాదులు పెరగటం అలసటకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. అలాగే, మరోవైపు గర్భం ధరించినప్పుడు శరీరంలో రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది. దాంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. దీనికోసం తెలియకుండానే ఎంతో ఎనర్జీ ఖర్చవుతుంది. మానసిక, భావోద్వేగాల అలజడి కూడా గర్భిణుల్లో అలసటకు ఒక కారణమే అంటున్నారు.
అదేవిధంగా పిల్లల్ని కంటున్నామనే ఉత్సకతే కాదు, కాన్పు ఎలా అవుతుందో, ఏ హాస్పిటల్లో చేరాలో, ఎంత డబ్బు ఖర్చవుతుందో, పిల్లలను ఎలా పెంచాలో అనే ఆలోచనలు కూడా వారి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇది చిన్న కుటుంబాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ ప్రభావం శరీరం మీదా పడుతుంది. అసౌకర్యం, చిన్న చిన్న నొప్పులు, రాత్రిపూట మూత్ర విసర్జన కోసం చాలాసార్లు నిద్రలేవటం వంటివన్ని కూడా అలసటకు దారితీసేవే అని సూచిస్తున్నారు నిపుణులు.
ఎప్పుడు ఎక్కువ అంటే?
నార్మల్‌గా మొదటి మూడు నెలల సమయంలో ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో అలసట చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కొంతమందికి ముందూ వెనక కావొచ్చు. రెండో త్రైమాసికంలో కాస్త హుషారుగా అనిపించినా మూడో త్రైమాసికంలో మళ్లీ అలసట సమస్య కనిపిస్తుంది. ఇందుకు ఫస్ట్ మూడు నెలలప్పుడు హార్మోన్లు కారణమైతే మూడో త్రైమాసికంలో నిద్ర పట్టకపోవటం, అసౌకర్యమే ఎక్కువగా అలసటకు దారితీస్తుంటాయంటున్నారు.
చలికాలంలో గర్భిణీలు ఇవి తప్పక పాటించాలట! లేకపోతే తల్లీబిడ్డకు ప్రమాదమేనట!
ఈ జాగ్రత్తలు పాటిస్తే అలసటకు చెక్!
సమతులాహారం : ప్రెగ్నెన్సీ టైమ్‌లో మహిళలు సరిగా తినకపోవటం మామూలే. ముఖ్యంగా వికారంగా అనిపించినప్పుడు, అలసిపోయినప్పుడు తినటం మరింత కష్టంగా అనిపిస్తుంది. అయినప్పటికీ అలాంటి టైమ్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా చూసుకోవాలి. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, పలుచటి మాంసకృత్తులు అధికంగా తినాలి. ఇవి శరీర పోషణకే కాకుండా శక్తి పెంపొందటానికీ తోడ్పడతాయంటున్నారు.
వాటర్ : గర్భిణులు అలసట బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యమంటున్నారు. ఇది తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో తగినంత నీరు తాగితే శరీర ప్రక్రియలన్నీ సజావుగా, తేలికగా సాగుతాయి. తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా ఉత్సాహమూ కలుగుతుంది. మూత్రం లేత పసుపు రంగులో వస్తుంటే తగినంత నీరు తాగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలట. అదే యూరిన్ రంగు గాఢంగా కనిపిస్తే నీరు, ద్రవాలు అంతగా తీసుకోవటం లేదని తెలుసుకోవాలంటున్నారు.
కెఫీన్ తగ్గించాలి : ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్ పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే కెఫీన్‌తో మూత్రం ఎక్కువగా వస్తుందనే సంగతి మరవరాదు. అప్పుడు తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే బాడీలో నీటిశాతం తగ్గుతుంది. ఇది నిస్సత్తువ, బడలికకు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు.
ఎక్సర్సైజెస్ : అసలే అలసి పోతుంటే ఇక వ్యాయామాలేం చేస్తాం? అని మీకు సందేహం రావొచ్చు. కానీ, గర్భిణులకు సురక్షితమైన ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు హుషారును కలిగించే ఎండార్ఫిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయడం అలసటకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. వీలుంటే పగటిపూట 10 నుంచి 15 నిమిషాలు కునుకు తీయటం మంచిది. దీంతో శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. రోజంతా హుషారుగా ఉండటానికి తోడ్పడుతుందంటున్నారు. మయో క్లీనిక్ వారు జరిపిన ఓ రిసెర్చ్‌లో కూడా ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీ టైమ్‌లో తలెత్తే అలసటను చాలా వరకు తగ్గించుకోవచ్చని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డెలివరీ తర్వాత పొట్ట తగ్గట్లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా పోతుందట!