Ex Minister Talasani on Dilawarpur Issue : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లోని ప్రతిపాదిత ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ కంపెనీ నుంచి తన కుమారుడు ఎనిమిదేళ్ల క్రితమే తప్పుకున్నారని అన్నారు. బాధ్యత గల ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ.. బీఆర్ఎస్ను, వ్యక్తులను బదనాం చేయాలని ప్రయత్నం తగదని ఆక్షేపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని మాజీ మంత్రి తలసాని సూచించారు. ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తానని మాజీమంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తమపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. లగచర్లలోనూ ఇదే తరహాలో కేటీఆర్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
అసలేం జరిగింది : ఈనెల 26న నిర్మల్ జిల్లా దిలావర్పూర్ -గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు ఉద్రిక్తగా మారి బుధవారం ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. 61వ నంబరు జాతీయ రహదారి ఆందోళనకారుల అరెస్టులు, రాళ్లు రువ్వటం, పోలీసులపై దాడి, వారు పరుగులు తీయటంతో దద్దరిల్లిపోయింది. పిల్లలు, పెద్దలు నుంచి అంతా రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ దిగివచ్చేలా చేశారు. గత రాత్రి వారు చేస్తున్న పోరాటం ఫలప్రదమైంది.
రాజకీయాలకు తావీయకుండా రెండు రోజులుగా జరిగిన ఆందోళనకు మహిళలే ముందు వరుసలో నిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చస్తే చావు.. లేకుంటే ఇథనాల్ పరిశ్రమ అన్నట్లు పోరాటం చేశారు. పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీద బైఠాయించి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. అక్కడే వంటావార్పు చేశారు. ఇక్కడ భారీగా మోహరించిన పోలీసులలో కొంత మంది పోలీసులు ముందస్తు అరెస్టు చేయటం తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు.. ఆ తర్వాత నిర్మల్-బైంసా 61వ జాతీయ రహదారిపైన బైఠాయించటానికి బయలుదేరి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ప్రతిఘటించే క్రమంలో ఓ దశలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు భయంతో పరుగులు తీశారు.. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిళ బుధవారం చర్చలకు ఆహ్వానించారు. దీంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది. వీరి మధ్య దాదాపు గంటన్నర పాటు ప్రధాన డిమాండ్లపై చర్చ జరగ్గా.. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలి ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఆందోళన కారులకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులపై పెట్టిన సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో పరిశ్రమను ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించి ఆనందంలో తేలిపోయారు. మంత్రి సీతక్క వారితో మాట్లాడి.. కేసులను ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
అన్నదాతల పోరాటం ఫలప్రదం - దిలావర్‌పూర్‌లో అంతా ప్రశాంతం
ఇథనాల్ పరిశ్రమ నిరసనలో తీవ్ర ఉద్రిక్తత - పోలీసులపై ఆందోళనకారుల దాడి