Karthika Puranam 28th Day In Telugu Pdf : పరమ పావనమైన కార్తిక మాసంలో కార్తిక పురాణం పఠనంలో భాగంగా ఈ కథనంలో శ్రీమన్నారాయణుని సూచన మేరకు దుర్వాసుడు పశ్చాత్తాపంతో అంబరీషుని వద్దకు వెళ్లాడా? అంబరీషుని ద్వాదశి వ్రతం పూర్తయిందా! వంటి విషయాలను అత్రి అగతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
అత్రి అగస్త్యుల సంవాదము
వశిష్ఠులవారు జనకమహారాజుతో "ఓ జనక రాజా! విన్నావుగా, దూర్వాసుని అవస్థలు. తాను ఎంతటి మహర్షి అయినా ఆగ్రహంతో వెనకాముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు. కనుకనే అతడు అట్టి అవస్థల పాలయ్యాడు. ఇంకను వినుము" అంటూ అత్రి అగస్త్య మునుల సంవాదమును వివరిస్తూ ఇరవై ఎనిమిదో రోజు కథను ప్రారంభించాడు.
అంబరీషుని శరణు కోరిన దుర్వాసుడు
ఆ విధంగా శ్రీమన్నారాయణుని నుండి సెలవు తీసుకుని దూర్వాసుడు తనను వెంటాడుతున్న చక్రమును చూసి భయపడుతూ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్లి "ఓ అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి నన్ను కాపాడుము. నీవు నా పైన గల గౌరవముతో నన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించావు. కానీ నేను నిన్ను కష్టాల పాలు చేసి నీ వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయదలిచాను. చివరకు నా దుర్భుద్ధియే సుదర్శన చక్ర రూపంలో నన్ను తరుముతున్నది. నేను విష్ణువు వద్దకు వెళ్లి శరణు వేడాను. ఆ శ్రీమన్నారాయణుడు నాకు జ్ఞానోదయం చేసి నీవద్దకు వెళ్ళమని చెప్పాడు. కావున నీవే నాకు శరణ్యం. నేనెంతటి తపశ్శాలినైనప్పటికిని నీ నిష్కళంక భక్తి ముందు నిలవలేకపోయాను . నన్ను ఈ ఆపద నుంచి కాపాడుము" అని ప్రార్థించ సాగెను.
సుదర్శన చక్రమును ప్రార్ధించిన అంబరీషుడు
పశ్చాత్తాపంతో దుర్వాసుడు పలికిన మాటలు విన్న అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, "ఓ సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారములు. ఈ దూర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుతో ఆపదను కొని తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ఇతను బ్రాహ్మణుడు. ఇతని చంపవద్దు. ఒకవేళ ఇతనిని చంపుటయే నీ కర్తవ్యమైతే ముందుగా నన్ను చంపి తరువాత దూర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయుణుని ఆయుధానివి. నేను ఆ స్వామి భక్తుడను. నీవు ఆ శ్రీహరి చేతిలో ఉండి లోకకంటకులైన అనేకమంది రాక్షసులను మట్టుపెట్టావు. శరణు కోరిన వారిని ఎన్నడూ ఏమి చేయలేదు. అందుకనే దూర్వాసముని ముల్లోకాలు తిరిగినను ఇతనిని వెంటాడుతున్నావే కానీ చంపలేదు. ఈ జగములోన దేవ,సుర, అసుర, సమస్త భూతకోటి శక్తులన్నీ ఏకమైనను నిన్ను ఎదుర్కొనలేవు. ఈ విషయం ప్రపంచమంతా తెలుసును. అయినప్పటికిని ఈ ముని పుంగవునికి ఎటువంటి హాని కలిగించవద్దని వేడుకుంటున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను ప్రార్ధించిన ఆ శ్రీహరిని ప్రార్ధించినట్లే" అని అనేక విధములుగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తుతించాడు.
శాంతించిన సుదర్శన చక్రం
అంబరీషుని ప్రార్ధనలు విని అప్పటి వరకు రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న ఆ విష్ణు చక్రం శాంతించి "ఓ భక్తాగ్రేసరా! నీ భక్తిని పరీక్షించుటకు అలా చేసితిని గాని వేరొకటి కాదు. ఈ లోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై ఆ శ్రీహరి నన్ను వినియోగించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఇది అందరికి తెలిసిన విషయమే! ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగతో నీ వ్రతమును నాశనం చేసి, నిన్ను నానా కష్టాల పాలు చేయాలని తలచాడు. దానితో నిరపరాధివైన నిన్ను రక్షించి, ఈ ముని గర్వభంగం చేయాలనీ అతనిని ఇట్లు తరుము చున్నాను.
గొప్ప రాజనీతి తెలిపిన సుదర్శన చక్రం
ఈ దూర్వాసుడు సామాన్యుడు కాడు. ఇతను రుద్రాంశ సంభూతుడు. అయినప్పటికీ శ్రీహరి చక్రం ధాటికి ఎవరూ ఎదురు నిలవలేరు. ఎప్పుడైనను తమకంటే బలవంతులతో యుద్ధము కన్నా సంధి చేసుకోవడం మేలు. ఈ రాజనీతిని పాటించేవారికి ఎటువంటి ఉపద్రవాలు రావు. ఇప్పటివరకు జరిగినది విస్మరించి ఈ దూర్వాసముని ని గౌరవించి నీ ధర్మం నిర్వర్తింపుము" అని చక్రాయుధము పలికింది.
చక్రాయుధానికి నమస్కరించిన అంబరీషుడు
అంబరీషుడు "నా రాజ్యములో అందరు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా ఆకాంక్ష. కావున శరణుకోరిన ఈ దూర్వాస మునిని, నన్ను రక్షింపుము" అని చక్రాయుధ పాదములపై పడెను. అప్పుడు సుదర్శనచక్రము అంబరీషుని పైకి లేపి గాఢాలింగనము చేసుకొని " ఓ అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రమును త్రికాలములందు ఎవరు పఠిస్తారో అట్టివారి కష్టములు నశిస్తాయి. ఈ దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలం ముందు దూర్వాసుని తపః ఫలము పనిచేయలేదు."అని చెప్పి అతనిని ఆశీర్వదించి, అదృశ్యమయ్యెను. ఈ విధంగా అత్రి,అగస్త్య మహామునుల సంవాదము ద్వారా సుదర్శన చక్రం మహాత్యమును వివరిస్తూ వశిష్ఠులవారు ఇరవై ఎనిమిదవ రోజు కథను ముగించాడు. ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే! అష్టావింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.