Entry Level Jobs Salaries : గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్(GCCలు), నాన్ టెక్నాలజీ సెక్టార్ల నేతృత్వంలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు మెరుగైన జీతాలు అందుతున్నాయని ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ టీమ్ లీజ్ కంపెనీ తన తాజాగా నివేదికలో వెల్లడించింది. ఆయా సంస్థల్లో ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లు ఊపందుకంటున్నాయని తెలిపింది. సాఫ్ట్‌వేర్ విభాగమంతా అప్లికేషన్‌లను కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం, నిర్వహించడంపై దృష్టి సారిస్తుందని చెప్పింది.
మంచి ఉద్యోగ అవకాశాలను అందించడానికి సిద్ధంగా ఉందని నివేదికలో వెల్లడించింది. ఆవిష్కరణలను పెంపొందించడానికి సాఫ్ట్‌వేర్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. పలు GCCలు, నాన్ టెక్నాలజీ రంగాల్లోని 15 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాథమిక డేటాను సేకరించి వాటి ఆధారంగా నివేదిక రూపొందించింది టీమ్ లీజ్ కంపెనీ.
సాఫ్ట్‌వేర్ విభాగంలోని GCCల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు రూ.9.37 LPA జీతం అందుతుందని, ఐటీ సెక్టార్లో రూ.6.23 LPA, నాన్ టెక్నాలజీ రూ.6.23 LPA జీతం అందుతుందని నివేదికలో టీమ్ లీజ్ తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని GCCల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు రూ.9.57 LPA జీతం పొందుతున్నారని నివేదికలో పేర్కొంది. ఐటీ సెక్టార్లో రూ.6.83 LPA, నాన్ టెక్ రంగంలో రూ.5.17 LPA అందుకుంటున్నారని చెప్పింది.
క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగంలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు GCCల్లో రూ.7.67 LPA, ఐటీ సెక్టార్లో రూ.6.07 LPA, నాన్ టెక్ సెక్టార్లో రూ.6.53 LPA జీతం అందుతుందని నివేదిక పేర్కొంది. డేటా మేనేజ్‌మెంట్ అనలిటిక్స్ విభాగంలోని GCCల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల జీతం రూ.8.73 LPAగా, IT సెక్టార్లో రూ.7.07 LPA, నాన్ టెక్‌లో రూ.6.37 LPAగా ఉందని అంచనా వేసింది. అయితే భారత్‌లో ఎంట్రీ లెవెల్ జాబ్ మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నట్లు తమ నివేదిక ద్వారా స్పష్టంగా తెలుస్తుందని టీమ్ లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. గత రెండుమూడేళ్లుగా ఐటీ రంగంలో ప్రవేశాలు తగ్గాయని, ఇప్పుడు మంచి అవకాశాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.