How to Make Tomato Dum Biryani Recipe : బిర్యానీ అనగానే చాలా మంది భోజన ప్రియులకు నోట్లో నీళ్లూరతాయి. వేడివేడిగా చికెన్, మటన్ బిర్యానీని రైతాతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే, మాంసాహారంతోనే కాకుండా టమాటలతో కూడా ఘుమఘుమలాడే బిర్యానీ ప్రిపేర్ చేయవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో రుచికరమైన టమాటాబిర్యానీ మీ ముందుంటుంది. సింపుల్‌గా టేస్టీగా టమాటా బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం - 2 కప్పులు
- టమాటాలు-8 (ప్యూరీ కోసం 4 టమాటాలు, 4 దమ్ బిర్యానీలోకి కట్ చేసుకోవాలి)
- చిన్న అల్లం ముక్కలు -2
- వెల్లుల్లి రెబ్బలు-10
- నూనె-2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి-2 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయలు-2
- కారం -2 టేబుల్‌స్పూన్లు
- ధనియాల పొడి-టీస్పూన్
- పసుపు-చిటికెడు
- జీలకర్ర పొడి - అరటీస్పూన్
- గరం మసాలా - అరటీస్పూన్
- కొత్తిమీర, పుదీనా తరుగు -కొద్దిగా
- పెరుగు -2 టేబుల్‌స్పూన్లు
- కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్
రైస్ ఉడికించుకోవడానికి.. అలాగే దమ్ బిర్యానీలోకి మసాలా దినుసులు (రెండు సార్లు ఇలా తీసుకోవాలి)..
- బిర్యానీ ఆకు
- చిన్న దాల్చిన చెక్క
- మిరియాలు -5
- షాజీరా-టీస్పూన్
- లవంగాలు-3
- యాలకులు-3
- మరాఠి మొగ్గలు-2
- కొంచెం జాపత్రి
తయారీ విధానం :
- ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయండి. నీరు మరుగుతున్నప్పుడు 4 టమాటాలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోండి.
- తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీయండి. వీటిని మిక్సీ గిన్నెలో వేయండి. అలాగే మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు అదే వాటర్‌లో రైస్ ఉడికించుకోవడానికి కావాల్సిన మసాలా దినుసులు, కొద్దిగా ఉప్పు వేసుకుని నీటిని మరగనివ్వండి.
- తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 80 శాతం ఉడికించుకోండి.
- రైస్‌ని జాలి గరిటె సహాయంతో మరొక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి.
- ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. గోల్డెన్ కలర్లో ఫ్రై చేయండి. వీటిలో సగం ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకుని కలపండి.
- ఇందులోనే టమాటా ప్యూరీ వేసి మిక్స్ చేయండి. ఒక నిమిషం తర్వాత టమాటా ముక్కలు వేసి కలపండి.
- అలాగే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమాటాలకు మసాలా మిశ్రమం బాగా పట్టేలా కలపాలి.
- తర్వాత ఉడికించుకున్న రైస్ వేయాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ చల్లుకుని మూత పెట్టాలి.
- సన్నని మంట మీద 10 నిమిషాలు దమ్ పెట్టుకుని స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇలా చేస్తే ఘుమఘుమలాడేటమాటా దమ్ బిర్యానీ మీ ముందుంటుంది.
- నచ్చితే ఈ విధంగా దమ్ బిర్యానీ ఇంట్లో చేసేయండి.
కార్తికమాసం స్పెషల్ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్ సూపర్ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్!
అప్పటికప్పుడు తయారు చేసే "కమ్మటి ఉసిరికాయ చట్నీ"- ఇలా చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!