తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పెరుగు పుల్లగా మారిందని పడేస్తున్నారా? - ఇలా వాడితే ఎన్నో ప్రయోజనాలు! - HOW TO USE SOUR CURD AT HOME

-పెరుగుతో ఎన్నో ప్రయోజనాలు -సాధారణ పెరుగుతో పోలిస్తే పుల్లటి పెరుగుతో వంటలకు మరింత రుచి

How to Use Sour Curd at Home
How to Use Sour Curd at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 9:41 AM IST

How to Use Sour Curd at Home :డెయిరీ ఉత్పత్తుల్లో ఒకటైన పెరుగు.. మన రోజువారీ జీవితంలో ఓ భాగమైంది. అయితే నిత్యం ఉపయోగించే ఈ పెరుగును ఫ్రిజ్‌లో పెట్టినా ఒక్కోసారి రుచి మారి పుల్లగా అవుతుంది. ఇలా పుల్లగా మారిన పెరుగును చాలా మంది అవసరం లేదని వాడకుండా బయటపడేస్తుంటారు. కానీ.. ఇలా వేస్ట్​ చేయకుండా దీంతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చని, దీనిని ఉపయోగించడం వల్ల వాటి రుచిని, మృదుత్వాన్ని పెంచచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • సాధారణంగా ఇడ్లీ, దోశ పిండిని రాత్రంతా పులియబెడుతుంటాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. అయితే అప్పటికప్పుడు వీటిని సిద్ధం చేసుకోవాలంటే.. పుల్లటి పెరుగు, కొన్ని నీళ్లతో పిండి మిశ్రమాన్ని తయారుచేసుకుంటే సరిపోతుందని.. తద్వారా ఈ వంటకాలు మెత్తగా, మృదువుగా వచ్చి.. రుచిగానూ ఉంటాయంటున్నారు.
  • ధోక్లా స్పాంజి తరహాలో మెత్తగా, మృదువుగా రావాలంటే అందులో సాధారణ పెరుగుకు బదులు పుల్లటి పెరుగును జత చేయాలని చెబుతున్నారు. తద్వారా అది తింటుంటే నోటికి ఒక రకమైన పులుపుదనం తగిలి మరింత రుచికరంగా ఉంటుందని వివరిస్తున్నారు.
  • జొన్న పిండి, రాగి పిండి, రవ్వతో అప్పటికప్పుడు ఇన్​స్టెంట్​ దోసెలు వేసుకునే వారు నీళ్లతో పాటు కాస్త పుల్లటి పెరుగుతో పిండి మిశ్రమాన్ని కలుపుకొంటే.. వాటి రుచి పెరుగుతుందని.. అవి మెత్తగానూ వస్తాయని చెబుతున్నారు.
  • ఛోలే భటూరే, మిర్చీ కా సలాన్‌, గుత్తి వంకాయ, దహీ ఆలూ.. వంటి గ్రేవీ వంటకాల్లో.. పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము.. వంటివి వాడతారని మనకు తెలిసిందే. అయితే వీటితో పాటు కాస్త పుల్లటి పెరుగు కూడా వేస్తే కూర ఇట్టే నోరూరిస్తుందని.. గ్రేవీ మరింత చిక్కగా వస్తుందని అంటున్నారు.
  • కర్డ్​ రైస్​ చాలా మంది తినే రెసిపీ. అయితే దీనిని సాధారణ పెరుగుతోనే తయారు చేస్తుంటారు. అలా కాకుండా పుల్లటి పెరుగుతోనూ రుచికరమైన పెరుగన్నం తయారుచేసుకోవచ్చు. అయితే పులుపు నోటికి తగలకూడదంటే.. తాలింపు పెడితే సరి. రుచి మరింత పెరుగుతుంది.
  • బ్రెడ్‌, ఇతర బేకింగ్‌ వంటకాలు తయారు చేసే క్రమంలో.. పిండిని పులియబెట్టడానికి ఈస్ట్‌ కలుపుతుంటాం. అయితే దీనికి బదులు కాస్త పుల్లటి పెరుగు వాడితే.. అందులోని ప్రొబయోటిక్‌ సమ్మేళనాలు పొట్ట ఆరోగ్యాన్ని పెంచుతాయని.. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయా పదార్థాలకు మృదుత్వం వచ్చి రుచిగా ఉంటాయని చెబుతున్నారు.
  • ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చికెన్‌ వింగ్స్‌, సలాడ్స్‌.. వంటివి క్రీమ్ ఛీజ్‌లో ముంచుకొని తినడం చాలా మందికి ఇష్టం. అయితే దీని తయారీలో కొద్దిగా పుల్లటి పెరుగు వాడితే.. నోటికి పుల్లపుల్లగా తగులుతుందని.. మరింత రుచికరంగానూ ఉంటుందని చెబుతున్నారు.
  • మజ్జిగ చారు చాలా మందికి ఫేవరెట్‌. ఎన్ని కూరలు ఉన్న ఈ పెరుగు చారుతో తింటేనే తృప్తి. అయితే దీన్ని సాధారణ పెరుగుతో కంటే పుల్లటి పెరుగుతో తయారుచేస్తే మరింత రుచిగా ఉంటుందని చెబుతున్నారు. దహీ వడ కోసం సాధారణ పెరుగు కాకుండా.. కాస్త పుల్లటి పెరుగు ఉపయోగిస్తే రుచి బాగుంటుందని అంటున్నారు.

నోరూరించే "పొట్లకాయ పెరుగు పచ్చడి" - ఇలా చేసి పెట్టారంటే నచ్చని వారూ ఇష్టంగా తినడం పక్కా!

ABOUT THE AUTHOR

...view details