Roads Development in Telangana : రోడ్లు, భవనాల శాఖ ఆధ్యర్యంలో రహదారుల అభివృద్ధి, నిర్వహణను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) పద్ధతిలో మోర్త్ (కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ) ప్రమాణాలకు అనుగుణంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో దాదాపుగా 12 వేల కిలోమీటర్ల రోడ్లను ఈ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ విధానం వైపే మొగ్గు చూపడంతో రాబోయే మూడేళ్లలో రాష్ట్ర రోడ్లను హైవేలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ పరిధిలో మొత్తం 27,737.21 కిలో మీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో బీటీ రోడ్లు 25,634.65(92.4%) కిలోమీటర్లు, సీసీ 882.36(3.2%) కిలోమీటర్లు, మెటల్ 316.72(1.10%) కిలోమీటర్లు, నాన్-మెటల్ రోడ్లు 903.48(3.3%) కిలోమీటర్ల మేర ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో మాత్రం మందకొడిగానే : రాష్ట్రంలో 12 వేల కిలోమీటర్ల మేర రహదారులను మోర్త్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరమయ్యే అవకాశముంది. కొన్నేళ్లుగా రోడ్లు, భవనాల శాఖకు భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు వేగంగా ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల కాగితాల మీద ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల సమయానికి బిల్లులు క్లియర్ కాకపోవడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో రోడ్ల అభివృద్ధికి నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హెచ్‌ఏఎం పద్ధతిలో రోడ్లను డెవలప్ చేస్తే ఖర్చు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిర్ణయించింది. మాములుగా ఈ విధానంలో ప్రభుత్వం 40 శాతం నిధులు ఇస్తే, మిగతాది కాంట్రాక్టర్ సంస్థ భరించాలి. పనులు మొత్తం పూర్తయిన తర్వాత ఆ సంస్థకు దశల వారీగా ప్రభుత్వం బిల్లులను చెల్లిస్తుంది.
టోల్‌గేట్లతో వసూలేనా? : కేంద్రం ప్రభుత్వం పలు జాతీయ రహదారుల పనులను ప్రస్తుతం ఇదే పద్ధతిలో చేపడుతోంది. తర్వాత టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి వాహనదారుల నుంచే ఆ రహదారికి చేసిన ఖర్చులను రాబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో టోల్‌ట్యాక్స్‌లు ఏర్పాటు చేస్తుందా? లేదా గుత్తేదారుకు సొంతంగా చెల్లిస్తుందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
జాతీయ రహదారులకు దీటుగా నిర్మించే రోడ్లపై ఆర్‌అండ్‌బీ శాఖ ఓ రిపోర్టును తయారు చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా మొత్తం రోడ్లు ఎన్ని కిలో మీటర్ల మేర ఉన్నాయి? జిల్లా, మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్ల పోడవు ఎంత? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? వంటి వివరాలతో అధికారులు తాజాగా జాబితాను సిద్ధం చేశారు.