Naxalites Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మద్దేడు పోలీసు స్టేషన్ పరిధిలోని బందెపార-కోరన్ జోడ్ అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వు గార్డు దళం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారస పడ్డారు. ఈ క్రమంలో భద్రతాబలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.
ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఐదు మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్‌లలో 14 మంది మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు. అటు నారాయణ్ పూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు సోన్ పూర్ పీఎస్ పరిధి హిర్గేనార్ అటవీ ప్రాంతంలో ఆయుధాల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.