India Women vs Ireland Women 2nd ODI: ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో మ్యాచ్ జరిగింది .ఈ మ్యాచ్‌లో భారత్ 116 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 370 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో దిగిన ఐర్లాండ్ 7 వికెట్లు నష్టానికి కేవలం 254 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, సాధు, సయాలి తలో వికెట్ తీశారు. సూపర్ సెంచరీచో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో కౌల్టర్ (80 పరుగులు) మినహా పెద్దగా ఎవరూ రాణించలేక పోయారు. ఏ దశలోనూ ఐర్లాండ్ పోటీలో లేదు. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టుంగా బంతులేశారు. అయితే వికెట్లు పడకపోయినప్పటికీ ఐర్లాండ్ వేగంగా పరుగులు సాధించలేకపోయింది. ఫార్బెస్ (38 పరుగులు), డెలానీ (37 పరుగులు), పాల్ (27 పరుగులు) ఫర్వాలేదనిపించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ రికార్డు స్థాయి స్కోర్ (370- 5 పరుగులు) నమోదు చేసింది. మహిళల వన్డే హిస్టరీలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్. జెమీమా రోడ్రిగ్స్ (102 పరుగులు; 91 బంతుల్లో 12x4) సెంచరీతో చెలరేగగా, ఓపెనర్లు స్మృతి మంధాన (73 పరుగులు), ప్రతీకా రావల్ (67 పరుగులు) హర్లీన్ డియోల్ (89 పరుగులు) హాఫ్ సెంచరీలు బాదారు. రిచా ఘోష్ (10) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ 2, డెంప్సీ ఒక వికెట్ తీశారు. తాజా విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే జనవరి 15న జరగనుంది.
స్కోర్లు
- భారత్ 370-5
- ఐర్లాండ్ 254-7