Sammakka Saralamma Small Fair Begins in Medaram : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మల చిన్నజాతర ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జాతర జరుగుతోంది. మహా జాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర నిర్వహిస్తారు. తెలంగాణ ఆదివాసీల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని అర్చకులు సంప్రదాయ పూజలు చేశారు. భక్తుల జయ జయ ధ్వనాలతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. రెండేళ్లకోసారి జరిగే పెద్ద జాతర మరుసటి సంవత్సరం చిన్న జాతర జరుగుతుంది.
గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా పూజలు : పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మెక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. జంపన్నవాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరకు వచ్చి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. మండ మెలిగే పండుగ పురస్కరించుకుని సాంప్రదాయ పూజలు నిర్వహించారు. మామిడి ఆకులతో దిష్టి తోరణాలు ఏర్పాటు చేసిన పూజారులు గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా పూజలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు : మొదటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. జంపన్నవాగు, గద్దెల పరిసరాల వద్ద భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. జంపన్న వాగులో నీళ్లు లేకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. గద్దెల వద్ద అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో ఎండ బాధ తగ్గింది. జంపన్నవాగు వద్ద స్నానాలు చేసిన భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం భద్రాచలం ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. దర్శనం బాగా జరిగిందని, ఏర్పాట్లు బాగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు తమ బిడ్డలకు తల్లుల చెంత బారసాల నిర్వహించారు.
భక్తుల రద్దీ పెరిగినా దర్శనాలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారంతో ప్రారంభమైన ఈ జాతర శనివారంతో ముగుస్తుంది.
నేటి నుంచే మేడారం చిన్నజాతర - భక్తుల సౌకర్యార్థం 200 ప్రత్యేక బస్సులు