Double ka Meetha in Telugu: హైదరాబాద్ స్పెషల్ స్వీట్ డబుల్ కా మీఠా ట్రై చేశారా? ఈ స్వీట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో జరిగే అన్ని వేడుకల్లో దాదాపుగా దీనిని వడ్డిస్తుంటారు. అయితే, దీనిని చేసుకోవడం కష్టంతో కూడుకున్న పని అని చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇలా చేస్తే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ చేసుకుని తినాలనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక స్వీట్ బ్రెడ్ లోఫ్
- అర లీటర్ పాలు
- చిటికెడు కుంకుమపువ్వు
- 100 గ్రాములు పచ్చి కోవా
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
- కొన్ని బాదం, పిస్తా, జీడిపప్పులు
- 20 కిస్మిస్
- ఒకటిన్నర కప్పుల నీళ్లు
- ఒకటిన్నర కప్పుల పంచదార
- ఒక టీ స్పూన్ యాలకుల పొడి
- వేయించడానికి సరిపడా నూనె
తయారీ విధానం
- ముందుగా బ్రెడ్‌ను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె, నెయ్యి పోసి వేడి చేసుకోవాలి.
- అనంతరం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను రంగు మారేంత వరకు వేయించుకోవాలి. (మీకు ఇష్టమైతే బ్రెడ్ ముక్కలని మొత్తం నెయ్యిలోనే వేయించుకోవచ్చు)
- ఎర్రగా మారిన తర్వాత బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఓ గిన్నెలో పాలు, కుంకుమ పువ్వు వేసి వేడి చేసుకోవాలి.
- పాలు బాగా మరిగిన తర్వాత పచ్చికోవా వేసి అది కరిగేంత వరకు పాలను కలపాలి.
- ఇప్పుడు ముందుగా వేయించిన బ్రెడ్ ముక్కలపైన పాలు, కోవా మిశ్రమాన్ని పోసి నానపెట్టుకోవాలి
- మరోవైపు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు, పంచదార వేసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే యాలకుల పొడి వేసి బ్రెడ్ ముక్కలను నానపెట్టాలి.
- అయితే, బ్రెడ్ ముక్కలు మరీ పేస్టు లాగా అవ్వకుండా జాగ్రత్తగా కలపాలి.
- ఇప్పుడు డ్రైఫ్రూప్ట్స్ అన్నింటినీ కాస్త నేతిలో వేయించుకుని బ్రెడ్ ముక్కలపైన వేసుకుంటే టేస్టీ డబుల్ కా మీఠా రెడీ.
- దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నపుడు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది.
ఏ బ్రాండ్ పిండి లేకుండానే 'గులాబ్ జామూన్'- ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయ్!