తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తోడు లేకుండానే మీ ఇంట్లో కమ్మటి పెరుగు - ఇలా చేయండి!

సాధారణంగా పెరుగు కోసం పాలు గోరువెచ్చగా అవ్వగానే తోడేయడం మనకు అలవాటే! అయితే, పెరుగు లేనప్పుడు ఈ పదార్థాలతో తోడు వేస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

How to Prepare Curd Without Curd
How to Prepare Curd Without Curd (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 9, 2024, 3:05 PM IST

How to Prepare Curd Without Curd:మనలో చాలా మందికి పెరుగు లేకుండా భోజనం పూర్తి కాదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇంట్లో తోడు పెట్టేందుకూ పెరుగు ఉండదు. ఇలాంటి సమయంలో ఇరుగుపొరుగు ఉన్నవాళ్లను తప్పకుండా అడగాల్సిందే! లేకపోతే దుకాణాలకు వెళ్లి పెరుగు కొనుక్కొస్తుంటారు. కానీ ఒక్కోసారి ఈ ఆప్షన్​ కూడా మనకు ఉండదు. ఇలాంటి సందర్భాల్లోనే ఎలాంటి తోడూ లేకుండానే మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో పెరుగు తయారుచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు పాలు పెరుగుగా ఎలా మారుతాయి?
పాలలో ఉండే గ్లోబ్యులర్‌ ప్రొటీన్లను కేసిన్లు అని పిలుస్తారు. మనం తోడు వేసే పెరుగులో లాక్టో బాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండు పదార్థాల మధ్య జరిగే రసాయనిక చర్య వల్ల పాలు పెరుగుగా మారుతాయి. అయితే పెరుగు తోడు లేని సమయంలో కొన్ని రకాల పదార్థాల్ని ఉపయోగించడం వల్ల చిక్కటి, రుచికరమైన పెరుగు తయారు చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

పచ్చిమిర్చి
గోరువెచ్చటి పాలలో పెరుగుకు బదులుగా పచ్చిమిర్చిని ఉపయోగించచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మూడు పచ్చి మిరపకాయల్ని కడిగి పొడిగా తుడవాలట. ఆ తర్వాత వీటిని తొడిమలతో సహా గోరువెచ్చటి పాలలో వేసి పూర్తిగా మునగనివ్వాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పాలను సుమారు 12 గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద కదిలించకుండా ఉంచితే.. పాలు పులిసి పెరుగు తయారవుతుందని వివరించారు. అయితే పెరుగు చక్కగా రావాలంటే మాత్రం మిరపకాయలు పాలలో పూర్తిగా మునిగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు లేని పరిస్థితుల్లో.. ఇదే పద్ధతిలో ఎండు మిర్చితోనూ కమ్మటి పెరుగు తయారుచేసుకోవచ్చని తెలిపారు.

నిమ్మరసం
మనలో చాలా మంది పాలు మరిగించేటప్పుడు నిమ్మరసం వేసి పనీర్‌ తయారుచేసుకుంటుంటారు. అయితే ఇదే నిమ్మరసం పాలను పెరుగుగా మార్చడంలో కూడా సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం గోరువెచ్చటి పాలలో అరచెక్క నిమ్మరసం వేసి.. ఓసారి కలిపి గిన్నెపై మూతపెట్టి పక్కన పెట్టేయాలట. అయితే, ఈ గిన్నెకు కాటన్‌ క్లాత్‌ చుట్టాలని.. ఇలా చేయడం వల్ల అందులో వెచ్చదనం ఎక్కువసేపు నిలిచి ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా పెరుగు చక్కగా కుదురుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా దాదాపు 12 గంటల పాటు కదిలించకుండా పక్కన పెట్టారంటే.. చిక్కటి, రుచికరమైన పెరుగు రెడీ అయిపోతుంది.

చింతపండు
మనం తోడేసే పెరుగులో ఉండే ఆమ్ల గుణాలూ పాలను పెరుగుగా మార్చడంలో సాయపడతాయి. ఈ గుణాలు చింతపండులో పుష్కలంగా ఉండడం వల్ల దీనిని తోడుగా వాడుకోవచ్చని నిపణులు అంటున్నారు. గోరువెచ్చటి పాలలో కాస్త చింతపండు వేసి ఓసారి కలిపి.. సుమారు 12 గంటలు కదపకుండా పక్కన పెడితే రుచికరమైన పెరుగు సిద్ధమవుతుందని చెబుతున్నారు.

అయితే, సాధారణంగా పెరుగు తోడుతో పోల్చితే ఇప్పుడు చెప్పిన ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పెరుగు కాస్త నెమ్మదిగా తోడుకుంటుందని నిపుణులు వివరించారు. అయితే ఇలా కుదురుకున్న పెరుగును ఫ్రిజ్‌లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు. ఇలా చేయకపోతే పెరుగు త్వరగా పుల్లబడిపోతుందని అంటున్నారు.

పచ్చి చింతకాయల రోటి పచ్చడి - పుల్లగా, కారంగా అద్దిరిపోతుంది!

రాత్రి మిగిలిన అన్నం పొద్దున ఎవ్వరూ తినట్లేదా? - ఇలా పుదీనా పులావ్ చేయండి - మెతుకు మిగిలితే అడగండి!

ABOUT THE AUTHOR

...view details