How to Make Custard Powder Easily at Home: కస్టర్డ్ పౌడర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. ఐస్‌క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్‌షేక్స్, డెజర్ట్స్.. ఇలా రకరకాల వంటల్లో ఈ పౌడర్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక ఈ పౌడర్ కొనాలంటే షాప్స్, సూపర్ మార్కెట్స్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడా అవసరం లేకుండా.. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు! కేవలం పదే పది నిమిషాల్లో ఈ కస్టర్డ్ పౌడర్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యం కూడా. అంతేకాదు.. మీరు సొంతంగా తయారు చేసుకున్న ఈ పౌడర్‌తో ప్రిపేర్ చేసుకునే రెసిపీలు చాలా రుచికరంగానూ ఉంటాయి! ఇంతకీ.. హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పంచదార - అర కప్పు
- కార్న్‌ఫ్లోర్(మొక్కజొన్న పిండి) - 1 కప్పు
- పాలపొడి - 1 కప్పు
- వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - అర చెంచా
- యెల్లో ఫుడ్ కలర్ - అర టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో తీసుకొని అందులో పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆవిధంగా మిక్సీ పట్టుకున్నాక.. అందులో కార్న్‌ఫ్లోర్, పాలపొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, ఫుడ్ కలర్ వేసి మరోసారి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అయితే, ఈ మిశ్రమం ఏమాత్రం బరకగా ఉండకూడదు కాబట్టి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ పట్టుకుంటే ఇంకా మంచిది.
- ఇక జల్లెడ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని వెంటనే స్టోర్ చేసుకోకుండా.. గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉన్న వేడి పూర్తిగా చల్లారాక తడి లేని పొడి సీసాలో భద్రం చేసుకుంటే చాలు. అంతే.. ఇంట్లోనే ఈజీగా "కస్టర్డ్ పౌడర్" రెడీ!
- ఇక ఈ కస్టర్డ్ పౌడర్‌ను కేవలం వెనిలీ ఫ్లేవర్‌తో మాత్రమే కాకాండా ఇతర ఫ్లేవర్స్‌కు కలిగిన ఎక్స్ట్రాక్ట్స్ కూడా వేసుకోవచ్చు.
- ఇక ఈ కస్టర్డ్ పౌడర్‌తో మీకు కావాలనుకున్నప్పుడు కస్టర్డ్ చేసుకోవచ్చు. అందులో ఆయా కాలాల్లో దొరికే మామిడి, అరటి, కర్బూజ, ద్రాక్ష.. వంటి తాజా పండ్ల ముక్కలు కలిపి నచ్చిన టేస్ట్‌లో ఫ్రూట్ కస్టర్డ్ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ పండ్లు అందుబాటులో లేకుంటే డ్రైఫ్రూట్స్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.
- అయితే.. ఇది ప్రిపేర్ చేయాలంటే నాలుగు కప్పుల పాలకు 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, పిస్తా, జీడిపప్పు, బాదం, ఖర్జూరాలు ఒక్కోటీ ఐదు చొప్పున, రెండు టేబుల్ స్పూన్ల కిస్‌మిస్ అవసరమవుతాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి ఇలా కస్టర్డ్ పౌడర్‌ను చేసుకొని.. నచ్చిన డిజర్ట్ని ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లిపాది ఆస్వాదించండి!