Peanut Chutney Recipe in Telugu : ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ టిఫెన్ చేసుకున్నా అందులోకి పల్లీ చట్నీ ఉండాల్సిందే. ఎందుకంటే అన్ని టిఫెన్స్లోకి అద్భుతమైన కాంబినేషన్ ఈ చట్నీ. కొంతమందికైతే పల్లీ చట్నీతో తింటేనే టిఫెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ, చాలా మందికి పల్లీ చట్నీ పర్ఫెక్ట్గా చేయడం రాదు. టేస్ట్‌లో ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వారు ఈసారి "పల్లీ చట్నీ" చేసేటప్పుడు ఇదొక్కటి యాడ్ చేసి చేసుకోండి. టేస్ట్ రెట్టింపు అవ్వడమే కాకుండా అన్ని టిఫెన్స్లోకి అదుర్స్ అనిపిస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ చట్నీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - 1 కప్పు
- జీడిపప్పు పలుకులు - 10
- పచ్చిమిర్చి - 4
- వెల్లుల్లి రెబ్బలు - 3 నుంచి 4
- చింతపండు - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు - 2 రెమ్మలు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- శనగపప్పు - కొద్దిగా
- మినప్పప్పు - కొద్దిగా
- ఎండుమిర్చి - 2
పదే పది నిమిషాల్లో - పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి"!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే పాన్‌లో జీడిపప్పు పలుకులను వేయించుకొని చల్లార్చుకోవాలి. చట్నీలో పల్లీలతో పాటు 'జీడిపప్పు'ను వేసుకోవడం ద్వారా పచ్చడి పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా టేస్ట్ అద్దిరిపోతుంది.
- ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్‌స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆలోపు చల్లారిన పల్లీలను పొట్టు తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
- ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగాక దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "పల్లీ చట్నీ" రెడీ!
- దీనితో ఏ టిఫెన్ తిన్నా సూపర్‌గా ఉంటుంది. టిఫెన్ కన్నా ఎక్కువగా చట్నీనే తినేస్తారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి!
ఈ స్టైల్లో ఒక్కసారి "టమాటా పచ్చడి" చేసుకోండి - ఔర్ ఏక్ ప్లేట్ ఇడ్లీ/దోశ మమ్మీ అని అడగడం పక్కా!