Best Ways to Remove Makeup for Healthy Skin :అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు ఆరాటపడుతుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొద్దిమందిని మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, కళ్ల కింద్ డార్క్ సర్కిల్స్ వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఈ సమస్యలన్నింటికీ రకరకాల కారణాలు ఉన్నా.. చర్మంపై పడిన దుమ్ము-ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్ తొలగించుకోకపోవడం.. వంటివి ముఖ్యమైనవిగా చెబుతున్నారు నిపుణులు. ఈ రెండింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి పలు సమస్యలు ఎదురువుతాయని అంటున్నారు. అందుకే.. రాత్రి పూట చర్మాన్ని సంరక్షించుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మేకప్‌ని ఇలా తొలగించుకోవాలి:రాత్రి పడుకున్న సమయంలో మన శరీరం చర్మ కణాల్ని రిపేర్ చేస్తుంది. అయితే.. పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేయకపోవడం వల్ల చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము-ధూళి అక్కడే ఉండిపోతుంది. దానివల్ల మొటిమలొస్తాయి. కాబట్టి నిద్ర పోయే ముందు మేకప్ పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, చాలా మంది మేకప్ తొలగించుకోవడానికి క్లెన్సర్‌ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ మేకప్ రిమూవర్‌ని వాడడం మంచిదని.. దీనివల్ల చర్మపు పీహెచ్ మారకుండా ఉంటుందని అంటున్నారు. అందుకోసం ఒక కాటన్ బాల్‌ని తీసుకొని దాన్ని మేకప్ రిమూవర్‌లో ముంచి మసాజ్ చేస్తున్నట్టుగా తొలగించుకుంటే.. మేకప్ పూర్తిగా తొలగిపోతుందని.. ఫలితంగా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు.
ఐ క్రీమ్..: ఒక్క కంటి కింద తప్ప.. ముఖంపై అన్ని భాగాల్లో నూనె గ్రంథులుంటాయి. అందుకే ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ల కింద చర్మాన్ని కాపాడుకోవడానికి రోజూ రాత్రి ఐ క్రీమ్‌ని ఉపయోగించడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కంటి కింది భాగంలో తేమ పెరిగి నల్లటి వలయాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. అందుకోసం కంటి కింద క్రీమ్ అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలని.. దీని వల్ల రక్తప్రసరణ మెరుగుపడి.. నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయంటున్నారు.
స్క్రబ్ చేయాలి:రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడైనా చర్మాన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలంటున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయని.. ఫలితంగా చర్మరంధ్రాలు మూసుకుపోకుండానూ జాగ్రత్తపడవచ్చుంటున్నారు. అలాగే.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియను రాత్రి పూట పాటిస్తే మెరుగైన ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.