Bus Explosion In Israel : ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్ సిటీలో ఆగి ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు సంభవించాయి. అయితే, ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, గురువారం సాయంత్రం బాట్‌యామ్‌లోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగాయి. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ విభాగం అధికారులు ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరో రెండు బస్సుల్లో కుడా పేలుడు పదార్థాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కానీ అవి పేలలేదని, వాటిని నిర్వీర్వం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ అనుమానం వ్యక్తంచేశారు. వెస్ట్‌బ్యాంక్‌లో కనుగొన్న పదార్థాలు తాజా పేలుడు పరికరాలు ఒకేలా ఉన్నాయని టెల్‌అవీవ్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై అత్యవసర భద్రతా సమావేశానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చినట్లు వెల్లడించింది.
ఆ మృతదేహం ఆమెది కాదు : ఇజ్రాయెల్
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో చనిపోయిన నలుగురు ఇజ్రాయెలీల మృతదేహాలను హమాస్ టెల్‌అవీవ్‌కు అప్పగించింది. అయితే, ఆ సంస్థ అప్పగించిన ఒక మృతదేహం తమ దేశానికి చెందిన మహిళది కాదని ఇజ్రాయెల్ పేర్కొంది. మిలిటెంట్ సంస్థ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది.
ఖాన్‌యుస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షిర్ బిబాస్, ఆమె ఇద్దరు కుమారులు ఎరియల్, కఫీర్‌లతో పాటు ఇంకొకరి మృతదేహాన్ని గురువారం రెడ్‌క్రాస్ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు ఈ శవపేటికలను హమాస్ ప్రదర్శనకు పెట్టింది. దీన్ని ఇజ్రాయెల్‌తో సహా పలు దేశాలు ఖండించాయి. షిర్ బిబాస్ అనే మహిళ పేర్కొంటూ హమాస్ అప్పగించిన మృతదేహం ఆమెది కాదని, తమ పరీక్షల్లో తేలినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్ నీరోజ్ ప్రాంతం నుంచి ఆ సంస్థ వీరిని అపహరించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఈ నలుగురు మరణించినట్లు మిలిటెంట్ సంస్థ పేర్కొంది.