Best Tips to Make Soft Chapati : బరువు తగ్గేందుకు.. చపాతీని చాలా మంది బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటారు. అలాగే బీపీ, షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా కనీసం రోజులో ఒకపూటైనా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే.. అందరికీ చపాతీలు చేయడం వచ్చినా.. కొద్ది మందికి మెత్తగా చేయడం రాదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. గట్టిగానే వస్తుంటాయి. టీవీ యాడ్స్‌లో చూపించినట్లుగా మెత్తగా, ప్లఫీగా చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. సాధ్యం కాదు. దీంతో విసుగెత్తిపోతారు. అయితే.. పిండి కలిపేటప్పుడు ఈ పదార్థాలలో ఏ ఒక్కటి కలిపినా చపాతీలు మెత్తగా వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి ఆ పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నెయ్యి : మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది నెయ్యి. అయితే నెయ్యి కేవలం ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా.. చపాతీలు మెత్తగా రావడానికి కూడా నెయ్యి దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చపాతీ పిండి కలిపేముందు అందులో కొద్దిగా గోరువెచ్చటి నెయ్యిని వేసి కలిపితే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయని చెబుతున్నారు.
పెరుగు: పెరుగును మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తాము. చపాతీలు మెత్తగా రావడానికి కూడా పెరుగు ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి పిండిలో కొద్దిగా పెరుగు కలిపి ఓ గంటపాటు పక్కన పెట్టి ఆ తర్వాత చేసుకుంటే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయని చెబుతున్నారు.
వేడి నీళ్లు: సాధారణంగా చాలా మంది చల్లటి నీళ్లతోనే పిండిని కలుపుతుంటారు. అయితే ఓసారి చల్లటి నీళ్ల బదులు వేడి నీళ్లు పోసి పిండి కలుపుకుంటే తేడా మీరే గమనించవచ్చంటున్నారు. వేడి నీటితో కలపడం వల్ల పిండి మృదువుగా మారి చపాతీలు మెత్తగా అవుతాయని వివరిస్తున్నారు.