Shankar Assets Frozen By ED : రోబో సినిమా (యంతిరన్)కు సంబంధించిన కేసులో ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన రూ.10.11 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
శంకర్ దర్శకత్వం వహించిన యంతిరన్ (రోబో) 2010లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.290 కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వానికి గాను శంకర్ రూ.11.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారు.
రోబో కథ కాపీ కొట్టారా?
అయితే ఈ సినిమా కథను (జిగుబా) అనే తన కథ నుంచి శంకర్ కాపీ కొట్టారని పేర్కొంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011 మే 19న చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు శంకర్ తన కథను దొంగిలించారని, ఈ విధంగా ఆయన కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఆధారంగా ఈడీ దర్శకుడు శంకర్‌పై వరుస దర్యాప్తులు చేస్తోంది.
మరోవైపు ఈ కేసు విషయంపై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక కూడా దర్శకుడు శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. జిగుబా కథకు, యంతిరన్ సినిమాకు మధ్య చాలా వరకు సారూప్యతలు ఉన్నాయని పేర్కొంది. యంతిరన్ సినిమా కథా నిర్మాణం, పాత్రల రూపకల్పన, నేపథ్యాలు మొదలైన అంశాలు అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని సదరు నివేదికలో ఉంది. దీనితో శంకర్‌పై కాపీరైట్ చట్టం 1957 సెక్షన్ 63 కింద శంకర్ నిబంధనలు ఉల్లఘించారని నిర్ధరణ అయ్యిందని ఈడీ పేర్కొంది. దీనితో మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద, ఆయనకు సంబంధించిన రూ.10.11 కోట్ల విలువైన స్థిరాస్తులను 17వ తేదీన ఈడీ స్తంభింపజేసింది. తాజా ఓ పత్రికా ప్రకటనలో ఆ విషయాన్ని తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఈడీ పేర్కొంది.