Champions Trophy Records : 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మహ్మద్ షమీ ఐదు వికెట్లతో విజృంభించడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో రోహిత్ తన పవర్ హిట్టింగ్‌తో మరో సారి అలరించాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్‌లు అరుదైన రికార్డులు అందుకున్నారు.
రోహిత్ 11,000 పరుగులు
వన్డేల్లో రోహిత్ 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డు అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న పదో బ్యాటర్. 270 మ్యాచ్‌లు, 261వ ఇన్నింగ్స్‌లో రోహిత్ 11 వేల మార్క్‌ను దాటాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 222 ఇన్నింగ్స్‌లతో విరాట్ కోహ్లీ మాత్రమే అతడి కంటే ముందున్నాడు.
రోహిత్ భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంగూలీ (11,363 పరుగులు)కి సమీపంలో ఉన్నాడు. అతడికి అధిగమిస్తే మూడో స్థానానికి చేరుతాడు. అదే విధంగా రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో రెండో స్థానంలో (338 సిక్సులు) ఉన్నాడు. టాప్ ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351)ని త్వరలో అధిగమించే అవకాశం ఉంది.
వన్డేల్లో 200 వికెట్లు సాధించిన షమీ
బంగ్లాపై షమీ (5/53)తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన రెండో వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 104వ మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. 133 మ్యాచుల్లో ఈ రికార్డు అందుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను అధిగమించాడు. ఓవరాల్‌గా మిచెల్ స్టార్క్ (102) షమీ కంటే ముందున్నాడు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తన ఖాతాలో 60 వికెట్లు వేసుకున్నాడు. అతడి తర్వాత జహీర్ ఖాన్ (59), జవగల్ శ్రీనాథ్ (47) ఉన్నారు.