Sheikh Hasina Latest News : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ ఆడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వెళ్లే 25 నిమిషాల ముందు తనపై, తన చెల్లెలు రెహానాపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఆ దాడి నుంచి తప్పించుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు తన పార్టీ అవామీ లీగ్ ఫేస్ బుక్ ఖాతాలో హసీనా ఆడియో విడుదల చేశారు.
పలుమార్లు హత్యాయత్నం!
గతంలోనూ పలుమార్లు తనపై జరిగిన హత్యాయత్నాల గురించి హసీనా వెల్లడించారు. "2000 ఏడాదిలో కోటలీపర బాంబు దాడి నుంచి బయటపడ్డాను. 2004 ఆగస్టులోనూ ప్రాణాపాయస్థితిలోంచి బయటపడ్డా. దేవుడి దయ వల్ల 2024 ఆగస్టు 5న మరోసారి చావు నుంచి తప్పించుకోగలిగాను. లేకపోతే ఈ పాటికే ప్రాణాలు కోల్పోయి ఉండేదాన్ని" అని హసీనా పేర్కొన్నారు. "నేను ప్రాణాలతో ఉన్నప్పటికీ, నా దేశంలో, నా ఇంట్లో ఉండే అవకాశం లేకుండా పోయింది" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అయితే ప్రజలకు ఇంకా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనను ప్రాణాలతో ఉంచాడని హసీనా పేర్కొన్నారు.
2000 ఏడాదిలో గోపాల్ గంజ్ జిల్లాలోని కోటలిపరలో ఎన్నికల ర్యాలీకి వెళ్లిన హసీనాపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు బాంబులు పెట్టి ఆమెను హతమార్చాలని చూశారు. పక్కా సమాచారంతో బాంబు నిర్వీర్య బృందాలు వాటిని తొలగించాయి. దీనితో దాడి నుంచి హసీనా బయటపడ్డారు. 2004 ఆగస్టులో ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో దాడి జరిగింది. ఇందులో 24 మంది మృతి చెందగా, 500 మంది గాయపడ్డారు. ఈ దాడిలో హసీనాకు సైతం గాయాలయ్యాయి.