Study Tips for 10 Class Students : పదో తరగతి పరీక్షలకు ఇంకో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. మార్చి 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే సమయం సమీపిస్తుండటంతో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు సైతం మంచి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కానీ పరీక్షల భయం పోవాలంటే విద్యార్థులు పక్కా ప్రణాళికతో సాధన చేయాలి. అలాగే మానసిక, శారీరకంగా దృఢంగా ఉంటేనే అప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశించిన ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భయం లేకుండా పరీక్షలు రాయాలంటే అధ్యాపకుల సూచనలు పిల్లలు పాటిస్తే మేలని చెబుతున్నారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు :
- పాఠ్యాంశాలు ఎప్పటికప్పుడు చదివితే ఆందోళన ఉండదు.
- విద్యార్థులు చదివిన వాటిని మరిచిపోకుండా ప్రతి రోజూ రాయాలి.
- ప్రణాళిక, సమయ పాలన అవసరం.
- ఇప్పటినుంచే విద్యార్థులు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారని తెలుసుకునేందుకు ప్రశ్నల సరళి, పాఠ్యాంశంలోని ముఖ్య అంశాలు, మార్కుల కేటాయింపుపై అవగాహనను పెంచుకోవాలి.
- పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయాలి. దీంతో గతంలో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చేవారో తెలుస్తుంది.
- దైనందిన అవసరాలకు సమయాన్ని కుదించి, ఏకాగ్రతతో ఏ సమయంలో చదవగలమో అన్న విషయాన్ని గుర్తించి చదువుకోవాలి.
- రోజులో ఎన్ని పాఠ్యాంశాలు చదవాలి. వారంలో ఎన్నింటిని పూర్తి చేయాలన్నది నిర్దేశించుకుంటునే మంచి ఫలితాలు వస్తాయి.
- ఏకధాటిగా చదవకుండా ప్రతి గంటకు 5 నుంచి 10 నిమిషాలు విరామం తీసుకుంటే శరీరానికి విశ్రాంతి, ఏకాగ్రత పెరుగుతుంది.
- పాఠ్యాంశాలను చదివేందుకు పునశ్ఛరణకు సమయాలను వేర్వేరుగా నిర్ధారించుకోవాలి. సందేహాలుంటే వెంటనే ఉపాధ్యాయులతో గానీ, తోటి విద్యార్థులను గానీ అడిగి నివృత్తి చేసుకోవాలి.
ఆరోగ్యం, చదువు :
- సమతుల్య ఆహారం అవసరం.
- ప్రొటీన్స్, విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.
- తగినంత నీరు తాగాలి.
- ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలి.
- పరీక్షలు పూర్తయ్యే వరకు మాంసాహారం, జంక్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు, మసాలాలు, బయటి ఆహారానికి దూరంగా ఉండే మంచిది.
- రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.
- ఉదయం, సాయంత్రం కాసేపు ధ్యానం, ప్రాణాయామం సాధన చేయాలి.
- కొంత సమయం వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరం అవుతుంది.
- చదివిన అంశాలను మిత్రులతో చర్చిస్తే గుర్తుండిపోతాయి.
- ఒకే చోట కూర్చొని గంటల తరబడి చదవకుండా ఉంటే మంచిది. అలాగే విరామం ఇవ్వాలి.
తల్లిదండ్రుల పాత్ర కీలకం : పరీక్షల సమయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను చదువు విషయమై ప్రోత్సహించాలని, వారిని తిట్టడం వంటివి చేయకూడదని తెలిపారు. చదువుకునే గది ప్రశాంతంగా, వెలుతురు, గాలి వచ్చేలా ఉండాలని సూచించారు. పరీక్షలంటే భయపడవద్దని, సానుకూల దృక్పథంతో ఉండాలని సలహా ఇచ్చారు. పదో తరగతిలో కొంతమందికి గణితమంటే భయం. అలాంటి వారు ఇష్టపడి చదివితే సులువుగా వస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్రం గంట చొప్పున సాధన చేస్తే గణితం అనేది సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు.