Modern Machine for Cleaning Roads : పారిశుద్ధ్య నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) రోడ్లపై కుప్పలుగా ఉన్న చెత్తను తొలగించి ట్యాంక్‌లో స్టోర్ చేసే కొత్త యంత్రాలను వినియోగించాలని కార్యాచరణకు సిద్ధమవుతోంది. చెన్నై, ముంబయి వంటి నగరాలలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఈ యంత్రాలు కార్మికులు ఊడ్చిన చెత్తను వాహనమే పైపు ద్వారా పీల్చుకుని ట్యాంక్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఈ యంత్రం వల్ల పని వేగంగా పూర్తవ్వడంతో పాటు, అతి చిన్న వ్యర్థాలను సైతం తొలగించే అవకాశం ఉంటుంది.
యంత్రం ఖరీదు రూ. 50 లక్షలు : మెషిన్ తయారీ సంస్థ మెక్లీన్ ఈ యంత్రాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి గురువారం (జనవరి 16న) మింట్‌కాంపౌండ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో యంత్రం పనితీరును ఇక్కడి అధికారులకు చూపించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య అదనపు కమిషనర్ రఘుప్రసాద్, ఖైరతాబాద్ ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఏఎంఓహెచ్ చంద్రశేఖర్ తదితరులు ఈ యంత్రం పనితీరును స్వయంగా పరిశీలించారు. యంత్రాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు దాదాపు రూ. 50 లక్షల వరకు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఈ యంత్రం పనితీరు పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు.
యంత్రం ప్రత్యేకతలు..
- చెత్తను ట్యాంక్‌లోకి లాక్కునేందుకు పైపు 8 ఎంఎం డయా పరిమాణంలో ఉంటుంది.
- 7 అంగులాల పరిమాణంలో ఉండే ఎలాంటి వస్తువునైనా లోపలికి లాక్కుంటుంది.
- రాళ్లు, కొబ్బరి బోండాం వంటి వాటినీ పైపు ప్రెజర్‌తో పీల్చేసుకుంటుంది.
- యంత్రం ట్యాంక్ బరువు దాదాపు 2.2 టన్నులు ఉంటుంది.
- ట్యాంక్ నిండిన తర్వాత చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి అన్‌లోడ్ చేస్తారు.