Karun Nair Re Entry : టీమ్ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్ ప్రస్తుత విజయ్ హరారే ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఈ దేశవాళీ టోర్నీలో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే 750+ పరుగులు చేసి, క్రికెట్ విశ్లేషకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అతడికి టీమ్ఇండియాలో చోటు కల్పించాలని పలువురు మాజీలు సైతం డిమాండ్ చేస్తున్నారు.
దీంతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానని గంపెడన్నీ ఆశలతో ఉన్నట్లు కరుణ్ వెల్లడించాడు. భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. ఈ రెండింటికి కూడా బీసీసీఐ ఇంకా జట్లను ప్రకటించలేదు. ఈ క్రమంలో తాను మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానని కరుణ్ నాయర్ నమ్మకంగా చెప్పాడు.
'దేశానికి ఆడాలనేదే నా కల. అది ఇప్పటికే నేను సాధించా. కానీ, ఆ కల ఇంకా సజీవంగానే ఉంది. అందుకే ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నానా అనిపిస్తోంది. ఒకవేళ నేను ఇప్పుడు టీమ్ఇండియాకు సెలెక్ట్ అయితే నాకు ఇది మూడో రీ ఎంట్రీ అవుతుంది. ఆ ఛాన్స్ కోసం నిరంతరం శ్రమిస్తున్నా. ఎప్పుడు క్రీజ్‌లోకి వెళ్లినా, అదే నా ఆఖరి అవకాశం అనుకొని ఆడతా. ఒక్కో మ్యాచ్‌లో మెరుగ్గా ఆడుకూ ముందుకు సాగుతున్నా. నాణ్యమైన క్రికెట్ ఆడటం వరకే నా చేతుల్లో ఉంటుంది. మిగతావన్నీ మన చేతుల్లో లేనివి. ఇప్పటికీ నేను ఎంపికవుతాననే నమ్మకం ఉంది'
'గతంతో పోలిస్తే నేనేమీ భిన్నంగా ప్రయత్నించలేదు. ఇందులో ఏ సీక్రెట్ లేదు. సంవత్సరాలుగా కష్టపడుతున్న దానికి ఇప్పుడు ఫలితం లభించినట్లు అనిపిస్తోంది. రోజూ కొత్త సవాల్‌గా భావించా. ఇప్పుడు అవకాశం రాదేమోనని భయపడటం లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ ఛాన్స్ రాకపోతే నా కెరీర్ ఇక్కడితోనే ముగిసిందని భావించను'
'ఏం జరిగిందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మళ్లీ నేను ఏం చేయాలనే దానిపై దృష్టి సారిస్తా. సున్నా నుంచే మొదలు పెట్టాలని, మరికొన్నేళ్లు కష్టపడాలని అనుకుంటా. ఇదే నా ఫార్ములా. కానీ, ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోను' అని కరుణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా జట్టును శనివారం ప్రకటించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ముంబయిలో మధ్యాహ్నం 12.30కి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా జట్టను ప్రకటించనున్నారు. ఇక ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
'డియర్ మరో ఛాన్స్ ఇవ్వొచ్చుగా'- క్రికెటర్ ట్వీట్ వైరల్- రోహిత్, విరాట్ ప్లేస్‌కు ఎఫెక్ట్!