Dy CM Bhatti Vikramarka Reviews Implementation of SC and ST Sub Plan : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. శాఖల వారీగా ఖర్చుల వివరాలు ప్రతినెలా వెల్లడించాలన్నారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ సమీక్ష నిర్వహించారు. సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆదాయం పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై ఈనెల 23న సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
సబ్ ప్లాన్ చట్టం కోటా ప్రకారం ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో తెలపాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. సెస్ అధికారులు అధ్యయనం చేసి తమ నివేదికలను ఆర్థిక, ప్రణాళిక శాఖలకు అందచేసి తరచూ సమావేశం కావాలని ఆదేశించారు. అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం అక్కడ వెదురు, అవకాడో, పామాయిల్‌తో పాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వండి : ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతోపాటు ఆదివాసీ, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ పునర్జీవనం కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వారికి వడ్డీ లేని రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని సూచించారు. ఇందిర జల ప్రభ, ఎత్తిపోతల పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్‌లు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, పురపాలక, ఎస్సీ, ఎస్టీ, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్యకార్యదర్శులు దాన కిషోర్, శ్రీధర్, శరత్, సందీప్ కుమార్ సుల్తానియా, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.