Minister Ponguleti on VLO, Serveyor Jobs : తెలంగాణలోని గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్‌ను నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఓ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను వెంటనే రూపొందించే ఈ ప్రక్రియపై కసరత్తు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఎంపిక పరీక్షకు విధివిధానాల ఏర్పాటు! : రెవెన్యూ అధికారుల ఎంపిక పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 450 మంది సర్వేయర్లు ఉండగా, మరో వెయ్యి మందిని నియమించేందుకు కావాల్సిన ప్రణాళిక, విధి విధానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల ఎంపికపై చర్చలు : జనవరి 26న ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలపై శుక్రవారం (జనవరిల 17న) సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటుపై, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకంతో పాటు సర్వేయర్ల నియామక ప్రక్రియల పైన పొంగులేటి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
"ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వాస్తవంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. అన్ని ఊళ్లలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవారి, లేని వారి జాబితాలు రెండింటిని గ్రామ పంచాయతీలో పెట్టాలి" -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మరో 400 మంది ఇంజినీర్లు అవసరం : ఈ సందర్భంగా మంత్రి అడిగిన సందేహాలపై అధికారులు పూర్తి వివరాలను వివరించారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో కేవలం 274 మంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నట్లు ఆయనకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడితే వాటి పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజినీర్లు అవసరమవుతారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో స్పందించిన మంత్రి ప్రస్తుతం ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజినీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనే విషయాన్ని పరిశీలించాలని సీఎస్ శాంతికుమారీకి సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గృహ నిర్మాణాల విషయంపై ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించడంపై కసరత్తు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
మళ్లీ వీఆర్వో వ్యవస్థ - పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు
నేటి నుంచి మీ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల సర్వేయర్లు - 'యాప్' ఓకే అంటే మీకు ఇల్లు వచ్చేసినట్లే!