Telecom Department focused on spam calls : ఇటీవల కాలంలో టెలికాం యూజర్లను స్పామ్ కాల్స్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి రోజుకో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కాల్ చేసి మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ పేరుతో ఓటీపీ చెప్పాలని, మీ ఖాతాను బ్లాక్ చేస్తున్నామని డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా పెట్టుబడుల పేరుతో మోసాలు, స్థిరాస్తి సంస్థ నుంచి మాట్లాడుతున్నామని తక్కువ ధరకు స్థలాల బుకింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.
స్పామ్ కాల్స్ నియంత్రణకు చర్యలు : దీంతో తాజాగా స్పామ్ కాల్స్ నియంత్రణకు టెలికం శాఖ ఎట్టకేలకు నడుం బిగించింది. ఏడాది కాలంలో ఏకంగా 73.14 లక్షల సిమ్‌కార్డులను బ్లాక్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. తప్పుడు పత్రాలతో తీసుకున్న సిమ్ కార్డులను గుర్తించేందుకు గతేడాది టెలికం శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా అన్ని మొబైల్ సంస్థలకు సంబంధించిన మొత్తం 134 కోట్ల సిమ్ కార్డులను విశ్లేషించింది. వాటిలో 79.74 లక్షల అనుమానిత సిమ్‌కార్డులను గుర్తించి వాటిలో 73.14 లక్షలు బ్లాక్ చేసింది. అడ్డగోలుగా సిమ్‌కార్డులు జారీ చేస్తున్న 70,895 మంది ఏజెంట్లను తీసేశారు.
13 లక్షల వాట్సప్ ఖాతాలు రద్దు : బిగ్‌డేటా ఎనాలసిస్ ద్వారా తప్పుడు వివరాలతో తెరిచిన 13 లక్షల వాట్సప్ ఖాతాలను రద్దు చేసింది. 12 లక్షల బ్యాంకు ఖాతాలను తొలగించాలని బ్యాంకులను ఆదేశాలు ఇచ్చింది. విదేశాల నుంచి వస్తున్న స్పూఫ్ కాల్స్‌ను గుర్తించేందుకు సెంట్రలైజ్డ్ ఇంటర్నేషనల్ అవుట్ రోమర్(సీఐవోఆర్) రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తోంది. విదేశాల నుంచి వస్తున్న అన్ని కాల్స్‌ను గుర్తించి స్పామ్ కాల్స్ ఉన్నట్లు గుర్తిస్తే ముందుగానే బ్లాక్ చేస్తోంది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో : సైబర్ నేరాల నివారణ చర్యలపై చర్చించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ‘షీల్డ్-2025’ సదస్సులో స్పామ్ కాల్స్ నియంత్రణపై చర్చించారు. స్పామ్ కాల్స్ విషయంలో టెలికం శాఖ ఇటీవలి కాలంలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో నేరగాళ్లు విదేశాలకు మకాం మార్చారు.
విదేశాల నుంచే కాల్స్ ఎక్కువ : నేరపూరిత కాల్స్ చాలావరకూ ఇప్పుడు విదేశాల నుంచే వస్తున్నాయి. ఇలాంటి వాటిపై అవగాహన పెరగడంతో చాలామంది స్పందించడం లేదు. సిమ్‌కార్డులను బ్లాక్ చేస్తుండటంతో నేరగాళ్లు అంతర్జాలం ద్వారా ‘సెషన్ ఇనిషియేషన్ ప్రొటోకాల్’(ఎస్‌ఐపీ) కాల్స్ చేస్తున్నారని, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం కొంత కష్టంగా మారిందని టెలికం మంత్రిత్వశాఖ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ ఆర్ పాటిల్ తెలిపారు. అయినప్పటికీ గతంలో పోల్చితే స్పామ్ కాల్స్ చాలా వరకు తగ్గాయన్నారు.
మీ రెండో సిమ్ వాడకపోయినా నో ప్రాబ్లమ్- రూ.20తో డీయాక్టివేషన్‌కు చెక్- ఎలా అంటే?
మీరు జియో సిమ్ వాడుతున్నారా?- ఈ స్పామ్ కాల్స్ బ్లాక్ సెట్టింగ్ మీకు తెలుసా?