Google Pay UPI Payments : గూగుల్ పే యూజర్లకు అలర్ట్. ఇప్పటి వరకు గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి ఉచితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు కదా. కానీ ఇప్పుడు ఈ యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ పేమెంట్స్ (యూపీఐ)పై గూగుల్ పే కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
నేడు చాలా మంది విద్యుత్ ఫీజులు, గ్యాస్ బిల్లులు లాంటి చిన్న చిన్న లావాదేవీల (తక్కువ విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలు) కోసం యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు గూగుల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్‌పై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు కన్వీనియెన్స్ ఫీజు, దీనికి అదనంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కూడా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పే దాదాపు ఒక ఏడాది క్రితం మొబైల్ రీఛార్జ్‌ల కోసం రూ.3 కన్వీనియెన్స్ ఫీజు ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌పై కూడా ఇలాంటి రుసుము వసూలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే వసూలు మొదలు పెట్టేసిందా?
ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం, ఒక కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించి విద్యుత్ బిల్లు చెల్లించగా, అతని నుంచి దాదాపు రూ.15 కన్వీనియెన్స్ ఫీజుగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. డెబిడ్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు అని దాని కింద రాశారు. అంతేకాదు జీఎస్‌టీ కూడా వసూలు చేస్తున్నట్లు కింద లేబుల్ రాశారని సమాచారం.
మానిటైజేషన్
నేడు భారతదేశంలో యూపీఐ పేమెంట్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అందుకే దీనిని క్యాష్ చేసుకునేందుకు గూగుల్ కంపెనీ యూపీఐ పేమెంట్స్ లావాదేవీలను మానిటైజ్ చేయడానికి సిద్ధమైనట్లు పై సంఘటన బట్టి తెలుస్తోంది. సర్వీస్ ప్రొవైడర్లు ఆర్థిక లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చులను రాబట్టుకోవడం కోసం ఇలాంటి మార్గాలను అనుసరించడం మామూలేనని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై గూగుల్ పే నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.