Russia Fired ICBM On Ukraine :ఉక్రెయిన్‌పై మధ్యంతర శ్రేణి క్షిపణితో దాడి చేసినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీర్ఘ శ్రేణి క్షిపణులతో తమ దేశంపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిచ్చిన దేశాలపై సైతం ఈ క్షిపణిని ప్రయోగిస్తామని హెచ్చరించారు. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినట్లు పుతిన్ ఆ దేశవ్యాప్త టీవీ ప్రసంగంలో చెప్పారు. అమెరికా, బ్రిటన్ క్షిపణులతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ఇది ప్రతిస్పందన అని పేర్కొన్నారు.
ఇతర దేశాలపై దాడులు చేసే ముందు రష్యా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని పుతిన్ చెప్పారు. రష్యా క్షిపణులను అడ్డగించే సామర్థ్యం అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థకు లేదని హెచ్చరించారు. డెనిప్రో నగరంపై రష్యా దళాలు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు ఇంతకుముందు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అయితే అది ఏ తరహా క్షిపణి అనేది వెల్లడించలేదు. మధ్యంతర క్షిపణితో రష్యా దాడి చేస్తుందని అమెరికా ముందుగానే అంచనా వేసింది.