Trump On USAID Funds for India : భారత్‌లో ఓటర్లశాతం పెంచేందుకు అమెరికా చేస్తున్నసాయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి ఉద్ధృతం చేశారు. భారత్‌కు అమెరికా సాయం అవసరం లేదని, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్)ను అవకాశంగా తీసుకుని ప్రయోజనం పొందుతోందని అన్నారు.
ఎన్నికలలో పోలింగ్ శాతం పెంచడానికి సహాయంగా భారతదేశానికి అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్ ఆరోపించారు. తామెందుకు మళ్లీ బ్యాలెట్ పేపర్లకు వెళ్లకూడదని ప్రశ్నించిన ట్రంప్, అమెరికా ఎన్నికల్లో భారత్‌ను సాయం చేయనివ్వాలన్నారు. వారికి అమెరికా నుంచి డబ్బు అవసరం లేదన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్, అమెరికాను వాడుకుంటుందని విమర్శించారు. తమ ఎగుమతులపై 200 శాతం సుంకాలు విధిస్తున్న భారత్‌కు అమెరికా పెద్దమొత్తంలో సాయం చేయటాన్ని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. భారత ఎన్నికల్లో ఓటు వేసేవారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తూ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డోజ్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నిధులను వినియోగించి ఉండొచ్చని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే, తమ దేశంలో ఓటర్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని, అందుకే ఈ నిధులను ఆపివేసినట్లు వివరించారు.
'వాస్తవాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయి'
అమెరికా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యూఎస్‌ఎయిడ్ ప్రయత్నించిందనే వార్తలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయని పేర్కొంది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని, అసలు వాస్తవాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. యుఎస్‌ఎయిడ్ అనేది ఓ మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలకు సాయం చేయడానికి రూపొందించిన విభాగమని తెలిపారు. అయినప్పటికీ దాని ద్వారా నిధులు దుర్వినియోగం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపించడం ఆలోచించదగ్గ విషయమని అన్నారు.
మరోవైపు దేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు తాజాగా ట్రంప్ వ్యాఖ్యలతో నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్ స్పష్టం చేసింది. యూఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై కేంద్రం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.