Jhalawar Borewell Accident : ఐదేళ్ల అమాయక బాలుడు ప్రహ్లాద్ తన స్నేహితులతో ఆడుకుంటూ 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా డగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్లా గ్రామంలో జరిగింది. తెరిచి ఉన్న బోరుబావిలో ప్రహ్లాద్ పడిపోగానే, పొలంలో ఉన్న అతడి స్నేహితులు ఉరుకులు పరుగులతో వెళ్లి కుటుంబ సభ్యులకు ఆ సమాచారాన్ని అందించారు.
దీంతో కుటుంబ సభ్యులు బోరుబావి వద్దకు చేరుకొని, అధికారులకు ఈ ప్రమాదం గురించి తెలియజేశారు. డగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, బాలుడు ప్రహ్లాద్‌ను బోరుబావి నుంచి బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. ఈ ప్రమాదం వివరాలను గంగ్‌ధర్ ఎస్‌డీఎం ఛత్రపాల్ సింగ్ కూడా ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు కూడా సమాచారాన్ని అందించినట్లు వెల్లడించారు. బోరుబావి నుంచి బాలుడిని బయటకు తీయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. బాలుడు ప్రహ్లాద్ తండ్రి కాలూ సింగ్ ఒక రైతు. పొలం సమీపంలోని బోరుబావి ఎటువంటి పిట్టగోడ లేకుండా తెరిచి ఉంది. దీంతో దాన్ని గుర్తించలేక బాలుడు పడిపోయాడు.
ఇదే తొలిసారేం కాదు
రాజస్థాన్ రాష్ట్రంలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి బోరుబావి ప్రమాదాల్లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తెరిచి ఉన్న బోర్‌వెల్ గుంతలను మూసివేయాలని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టమైన సూచనలు చేస్తోంది. అయినా ఆ దిశగా రైతుల నుంచి ప్రయత్నమేదీ జరగడం లేదు. ఫలితంగా పలువురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.