తెలంగాణ

telangana

ETV Bharat / international

సుచిర్ బాలాజీ మృతికి కారణమేంటి? మస్క్ ఏమంటున్నారు? - MUSK REACTION ON SUCHIRBALAJI DEATH

అతడిది బలవన్మరణంలా అన్పించట్లేదు: సుచిర్‌ బాలాజీ మరణంపై మస్క్‌ పోస్ట్‌

Musk Reaction on Suchir Balaji Death
Musk Reaction on Suchir Balaji Death (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 10:12 AM IST

Musk Reaction on Suchir Balaji Death : ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై ఎఫ్‌బీఐతో విచారణ జరిపించాలని బాలాజీ తల్లి చేస్తున్న డిమాండ్‌ను ఎలాన్‌ మస్క్‌ సమర్ధించారు.

ఓపెన్‌ ఏఐపై ఘాటు విమర్శలు
చాట్‌జీపీటీ మాతృ సంస్థ 'ఓపెన్‌ ఏఐ' సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో ప్రజా వేగు(విజిల్‌ బ్లోయర్‌) సుచిర్‌ బాలాజీ (26) తీవ్ర విమర్శలు చేశారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన హఠాత్తుగా మరణించడం టెక్‌ ప్రపంచంలో సంచలనంగా మారింది. అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. అతడిది బలవన్మరణంలా అన్పించడం లేదన్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

సుచిర్‌ బాలాజీ అమెరికా, శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో నవంబరు 26న విగతజీవిగా కనిపించారు. ప్రాథమిక విచారణ అనంతరం, పోలీసులు దీన్ని బలవన్మరణంగా నిర్ధరించారు. అయితే, తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. తాము ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకొని రెండోసారి శవపరీక్ష చేశామని ఆమె తెలిపారు. ఆ పరీక్ష ఫలితాలు పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు.

"సుచిర్‌ అపార్ట్‌మెంట్‌ను ఎవరో దోచుకున్నట్లు కన్పిస్తోంది. బాత్‌రూమ్‌లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. రక్తపు మరకలు కన్పించాయి. ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చిచెప్పారు. మాకు న్యాయం జరగాలి. దీనిపై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలి" అని పూర్ణిమ కోరారు. ఈ పోస్ట్‌ను ఎలాన్‌ మస్క్‌, భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్‌ చేశారు. దీనిపై మస్క్‌ స్పందిస్తూ 'అది ఆత్మహత్యలా అనిపించడం లేదు" అని పోస్ట్‌ చేశారు.

నిజం చెప్పడమే నేరమా?
భారత సంతతికి చెందిన సుచిర్‌ బాలాజీ నాలుగేళ్ల పాటు 'ఓపెన్‌ ఏఐ'లో పరిశోధకుడిగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవడం లేదన్నారు. చాట్‌జీపీటీ అభివృద్ధి సమయంలో సంస్థ కాపీరైట్‌ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అక్టోబరులో 'న్యూయార్క్‌టైమ్స్‌'తో బాలాజీ మాట్లాడుతూ, "వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. 2022లో కాపీరైట్‌ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ఓపెన్‌ఏఐపై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం అనుమానాలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details