Israel Attack On Palestine Today :ఇజ్రాయెల్ దాడులతో గాజా అట్టుడుకుతోంది. తాజాగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో మానవతా సహాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 70 మందిమృతి చెందారు. 280 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు షిఫా ఆస్పత్రిలోని నర్సింగ్ విభాగం హెడ్ డాక్టర్ జాదల్లా షఫాయి తెలిపారు. అయితే ఈ నివేదికలను తాము పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
గాడిద బండ్లపై మృతదేహాలు
దాడి జరిగిన ప్రాంతంలో నేలమీద పడిఉన్న డజన్లకొద్దీ మృతదేహాలను వైద్యులు చూశారని కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని అంబులెన్స్ సేవల హెట్ ఫేర్స్ అఫానా తెలిపారు. క్షతగాత్రులు, మృతదేహాలను తీసుకెళ్లేందుకు సరిపడా అంబులెన్స్‌లు లేక, కొందరిని గాడిద బండ్లపై ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు.
బ్యాటరీలతో నడుస్తున్న ఆపరేషన్ థియేటర్
గాయపడిన వారు ఇంకా ఆస్పత్రికి వస్తున్నారని అల్-అవుదా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ సల్హా తెలిపారు. రిసెప్షన్ వద్ద, ఎమర్జెన్సీ గదుల్లో చాలా మంది ఉన్నారని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరికే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో విద్యుత్ లేదన్న సల్హా, బ్యాటరీ పవర్‌తో ఆపరేషన్ థియేటర్‌ను నడిపిస్తున్నామని తెలిపారు. అయితే ఆ బ్యాటరీ బ్యాకప్ కూడా కొన్ని గంటలు మాత్రమే వస్తుందని చెప్పారు. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.