Jaishankar At Trump Inauguration : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 20న జరిగే ఈ కార్యక్రమానికి అగ్రరాజ్యం పలు దేశాలకు ఆహ్వానం పంపుతోంది. భారత్‌కు సైతం ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ట్రంప్ వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ హాజరుకానున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆయన అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు, ఇతర నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొంది.
ట్రంప్ ప్రమాణ స్వీకారం!
డొనాల్డ్ ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా హాజరుకానున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ - జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి అప్పట్లో గైర్హాజరయ్యారు.
నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఓడించి, ఘన విజయం సాధించారు. జనవరి 20న అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో భారతీయ అమెరికన్ ఢోల్‌బ్యాండ్ సందడి చేయనున్నట్లు సమాచారం.
మొదటి రోజే పెనుమార్పులకు ట్రంప్ శ్రీకారం
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పెనుమార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన కార్యవర్గం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బైడెన్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వాటిని ట్రంప్ వెనక్కి తీసుకొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక విధాన పరమైన నిర్ణయాలు దీనిలో ఉంటాయని భావిస్తున్నారు.
క్యాపిటల్ హిల్‌లో జరిగిన ఓ ప్రైవేటు సమావేశంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల గురించి ట్రంప్ తన పార్టీ సెనెటర్లకు వెల్లడించినట్లు సమాచారం. సరిహద్దులపై తీసుకునే నిర్ణయాలను ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ఇప్పటికే సెనెటర్లకు చెప్పారు. ఈ ఆర్డర్లలో అమెరికా-మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, ఫెడరల్ షెడ్యూల్ ఎఫ్‌లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయం లాంటివి ఉన్నాయి.