Steve Jobs Wifes Hindu Name : యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ పేరు మార్చుకున్నారు. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరానికి చేరుకున్న ఆమె తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహరాజ్, లారీన్ పావెల్ జాబ్స్‌కు కమల అని నామకరణం చేసినట్లు తెలిసింది. లారీన్‌కు కమల అని గత శుక్రవారం రోజే (జనవరి 10న) నామకరణం చేశామని కైలాసానంద గిరి మహరాజ్ వెల్లడించారు. ఆమె తనకు కూతురు లాంటిదన్నారు. లారీన్ పావెల్ జాబ్స్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి అని ఆయన చెప్పారు. మెడిటేషన్ చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు.
నిరంజనీ అఖాడా శోభాయాత్రలో కమల పాల్గొంటారా ?
"మహాకుంభ మేళా వేళ నిరంజనీ అఖాడా నిర్వహించే శోభాయాత్ర (పేష్వాయీ)లో కమల(లారీన్ పావెల్ జాబ్స్) పేరును కూడా చేరుస్తారా ?" అని కైలాసానంద గిరి మహరాజ్‌ను ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ "తప్పకుండా కమల పేరును మా పేష్వాయీలో చేర్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే అందులో పాల్గొనాలా? వద్దా? అనేది ఆమె ఇష్టం. ఈసారి మహాకుంభ మేళాలో పాల్గొనే సాధువులను కలవడానికి ఆమె వచ్చారు. మన సంప్రదాయాల గురించి ఆమెకు అంతగా తెలియదు. వాటిని తెలుసుకోవాలని కమల భావిస్తోంది. ప్రతి ఒక్కరు ఎవరో ఒక గురువు ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా కమల భారత్‌కు వచ్చినప్పుడల్లా నన్ను కలవడానికి వస్తున్నారు" అని కైలాసానంద గిరి మహరాజ్ పేర్కొన్నారు.
జనవరి 29వ తేదీ వరకు స్వామి కైలాసానంద గిరి మహరాజ్‌కు చెందిన ఆశ్రమంలోనే ఉంటూ మహాకుంభ మేళాకు సంబంధించిన వివిధ పూజా కార్యక్రమాల్లో కమల(లారీన్ పావెల్ జాబ్స్) పాల్గొంటారని సమాచారం.
మహా కుంభమేళాకు మహాదేవుడిని ఆహ్వానించా : కమల
ఇక భారత్‌కు చేరుకున్న వెంటనే కమల (లారీన్ పావెల్ జాబ్స్) కాశీకి వెళ్లారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడారు. "మహాకుంభ మేళా ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని మహాదేవుణ్ని పూజించాను. మహాదేవుణ్ని కుంభమేళాకు ఆహ్వానించేందుకు నేను కాశీకి వచ్చాను" అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది.