Father Daughter Cycle Yatra To Maha Kumbh : దిల్లీ సమీపంలోని గాజియాబాద్‌కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిల్‌పై ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. వందలాది కి.మీ ప్రయాణించి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తండ్రీకూతుళ్లు ఈ సైకిల్ రైడ్ చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
గాజియాబాద్‌లోని వసుంధర ప్రాంతానికి చెందిన హోమియోపతి వైద్యుడు ఉమేశ్ పంత్ పుణ్య స్నానం కోసం తన కుమార్తె ఉమాంగ్ పంత్(19)తో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రూ.50 వేలు పెట్టి రెండు సైకిళ్లను కొనుగోలు చేశారు. గాజియాబాద్ నుంచి ఫిబ్రవరి 10న బయలుదేరి 650 కి.మీ ప్రయాణించి ఐదు రోజుల్లో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ పుణ్యస్నానాలు చేసి ఫిబ్రవరి 19కి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణానికి తండ్రీకూళుళ్లకు రూ.75,000 ఖర్చు అయ్యింది.

ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు!
"ప్రతిరోజూ దాదాపు 100-150 కిలోమీటర్లు సైకిల్‌ను తొక్కేవాళ్లం. ముూడు గంటలకొకసారి విశ్రాంతి తీసుకునేవాళ్లం. ప్రయాణంలో నా కూతురు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే మా సైకిల్ యాత్ర లక్ష్యం. ఈ కారణంగానే మేము మహా కుంభ్‌కు సైకిల్ మీద వెళ్లాం. మహాకుంభ్‌కు వెళ్లేటప్పుడు ప్రజల నుంచి మాకు అపూర్వమైన మద్దతు లభించింది. చాలా చోట్ల ప్రజలు మాకు పూలమాలలతో స్వాగతం పలికి సత్కరించారు. ఈ ప్రయాణంలో మేము దాదాపు 10,000 మందికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాం. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి రెండు సైకిళ్లను కొన్నాను. ఒక్కో సైకిల్ ధర రూ.25,000. నేను ప్రతిరోజూ 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను. శరీరం మన అత్యంత విలువైన ఆస్తి. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని ఉమేశ్ పంత్ తెలిపారు.
తొలుత ఉమేశ్ పంత్ సైకిల్‌పై కుంభమేళాకు వెళ్తానని అన్నప్పుడు కుటుంబ సభ్యులు భయపడ్డారు. కానీ ఉమేశ్ కూతురు ఉమాంగ్ పంత్ ఆయన్ను ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న కూతుర్ని పిలిపించి కుంభమేళాకు ఉమేశ్ పయనమయ్యారు.
"ఇంటి నుంచి బయలుదేరి కొన్ని కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన తర్వాత చాలా కష్టంగా అనిపించింది. కానీ ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ పర్యటనలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కలిశాం. దారిలో ప్రజలు చాలా సహాయం చేశారు. మేము సైకిల్‌పై వెళ్తుంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడేవారు. ఇది చాలా మంచి అనుభవం. మేము త్వరలో మరో సైకిల్ యాత్ర చేపట్టబోతున్నాం" అని ఉమేశ్ కుమార్తె ఉమాంగ్ పంత్ తెలిపారు.