Ukraine North Korean Soldiers Exchange Offer : రష్యా వైపు పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ప్రకటించారు. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ఉత్తర కొరియా సైనికులను కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని జెలెన్‌స్కీ తాజాగా కీలక ప్రకటన చేశారు.
'అలా చేస్తేనే బందీలను ఉత్తరకొరియాకు అప్పగిస్తాం'
"రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను మా ఆధీనంలోకి తీసుకున్నాం. ఉత్తర కొరియాకు చెందిన మరి కొంత మంది సైనికులను పట్టుకోవడానికి మా సైన్యం ప్రయత్నిస్తోంది. రష్యా వద్ద బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనికులను విడుదల చేస్తేనే, మా అదుపులో ఉన్న ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగిస్తాం" అని జెలెన్‌స్కీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా గాయాలతో చికిత్స పొందుతున్న ఉత్తర కొరియా సైనికుడితో మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. ఉక్రెయిన్ భద్రతా సర్వీస్ ఎస్‌బీయూ అధికారులు పట్టుబడిన ఉత్తరకొరియా సైనికుల గురించి పలు వివరాలు వెల్లడించారు. ఒక సైనికుడి దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి వద్ద రష్యా మిలిటరీ కార్డు ఉందని పేర్కొన్నారు.
In addition to the first captured soldiers from North Korea, there will undoubtedly be more. It’s only a matter of time before our troops manage to capture others. There should be no doubt left in the world that the Russian army is dependent on military assistance from North… pic.twitter.com/4RyCfUoHoC
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 12, 2025
'భారీగా ఉత్తరకొరియా సైనికులు మృత్యువాత'
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా దాదాపు 10,000 మంది ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కానీ దీనిపై రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రష్యా సైన్యం తరఫున యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ఇంతకుముందే జెలెన్‌స్కీ ప్రకటించారు. కాగా, అందులో వారి నిజమైన పేర్లు, వివరాలు మార్చేసి రష్యాకు చెందిన సైనికులుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించామని వెల్లడించారు.
'రష్యా వారిని కాల్చి చంపేస్తోంది'
రష్యా తరఫున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జెలెన్‌స్కీ. వారిని సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని అన్నారు. యుద్ధంలో ఉత్తరకొరియా సైనికుల పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో, గాయపడిన వారిని తమకు చిక్కకుండా రష్యా జాగ్రత్త పడుతోందని అన్నారు. అందులో భాగంగా రష్యా వారిని కాల్చి చంపేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారని, చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారని కీవ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి అంతర్గత సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు, వారు ఉత్తర కొరియా యాసలో మాట్లాడుతున్నట్లు తెలిసిందని చెప్పాయి.
'శత్రు దేశంలో తలదాచుకుంటాం'
ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న ఉత్తరకొరియా సైనికులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రభుత్వం విడుదుల చేసిన వీడియోలో ఓ ఉత్తర కొరియా సైనికుడు ఉక్రెయిన్‌లోనే ఉండటానికి ఆసక్తి చూపించాడు. ఇక, స్వదేశానికి తిరిగివెళ్లకూడదనుకునే వారికి మిగతా ఆప్షన్లు కూడా ఉన్నాయని జెలెన్‌స్కీ తెలిపాడు.
మరోవైపు, ఉక్రెయిన్‌లో బందీలుగా ఉన్న ఉత్తరకొరియా సైనికులు, దక్షిణ కొరియాలో శరణార్థులు ఉండటానికి ఆసక్తి చూపించలేదని ఆ దేశ గూఢచార సంస్థ తెలిపింది. ఈ మేరకు దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీలో, ఆ దేశ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది. ఉత్తరకొరియా సైనికులను విచారించేటప్పుడు ఉక్రెయిన్ అధికారులతో పాటు తాము కూడా పాల్గొన్నామని తెలిపింది.