Los Angeles Wildfires Cause : అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని చిన్న మంటలను అదుపులోకి తెచ్చినా పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. వేలాది ఇళ్లను బూడిదగా మార్చిన దావాగ్నికి నూతన సంవత్సర వేడుకలే కారణమనే ప్రచారం మొదలైంది. ఆ సమయంలో కాల్చిన బాణాసంచానే కార్చిచ్చుకు దారితీసిందని వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది.
న్యూయార్ వేడుకల సందర్భంగా కొందరు కాల్చిన బాణాసంచాతో మంటలు అంటుకొని అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. గంటల తరబడి యత్నించి వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అయితే మిగిలిన చిన్నపాటి నిప్పునకు బలమైన గాలులు తోడు కావడం వల్ల కార్చిచ్చు రాజుకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం పాలిసేడ్స్ ఫైర్ అక్కడే మొదలైందని ఆ పత్రిక తెలిపింది. అంతేకాకుండా తొలుత అగ్నిప్రమాదాన్ని వేగంగా అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది ఈ కార్చిచ్చు చెలరేగిన సమయంలో మాత్రం వేగంగా స్పందించలేదని స్థానికులు తెలిపినట్టు కథనంలో వెల్లడించింది.
మరోవైపు కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. కొన్ని రసాయనాలు కలిపిన ఫోస్ చెక్ అనే మిశ్రమాన్ని దాదాపు 9 విమానాలు, 20 హెలికాఫ్టర్ల సాయంతో మంటలు వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో వెదజల్లుతున్నారు. గులాబి రంగులో ఉన్న ఆ పదార్థం అక్కడి నిర్మాణాలు, మొక్కలపైనా పడి అగ్ని కీలల వ్యాప్తిని నెమ్మదింపజేస్తుందని అధికారులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో దొంగలు
సంపన్న ప్రాంతమైన పాలిసేడ్స్ సహా ఇతర ప్రాంతాల్లో విలువైన వస్తువులను వదిలేసి వేలాది మంది ఇళ్లను ఖాళీ చేశారు. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. వారిలో ఒకరు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది దుస్తుల్లో అక్కడ సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఖాళీ ఇళ్లను కాపాడేందుకు 400 మంది నేషనల్ గార్డ్స్‌ను అక్కడ మోహరించారు. ఇప్పటివరకు 29 మంది దొంగలను అరెస్టు చేసినట్లు లాస్ ఏంజెలెస్ అధికారులు వెల్లడించారు.
ప్రాణాంతకంగా ప్రైవేటు డ్రోన్లు
లాస్ ఏంజెలెస్‌లో ప్రైవేటు డ్రోన్లు అగ్నిమాపక విమానాలకు ప్రాణాంతకంగా మారాయి. తాజాగా ఓ డ్రోన్ సూపర్ స్కూపర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం కాస్త దెబ్బతింది. అసలే వనరులు చాలక లాస్ ఏంజెలెస్ ఇబ్బందిపడుతున్న వేళ ఈ డ్రోన్లు తలనొప్పిగా మారాయి. తాజాగా ఆ డ్రోన్ ఆపరేటర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు మొదలుపెట్టింది.
మృతుల సంఖ్య 24
ఇప్పటివరకు ఈ కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. ఏటోన్‌లోనే అత్యధికంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పాలిసేడ్స్‌లో 8 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. పాలిసేడ్స్‌లో 23,707 ఎకరాలను, ఏటోన్‌లో 14,117 ఎకరాలను, కెన్నెత్‌లో 1,052 ఎకరాలను, హుర్సెట్‌లో 779 ఎకరాలను కార్చిచ్చు దగ్ధం చేసింది. మొత్తం 12వేల నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 160 చదరపు కిలోమీటర్లు కాలిబూడిదయ్యాయి.