Weekly Insulin for Type 2 Diabetes : రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో పెట్టుకునేందుకు కొందరు డయాబెటిస్ బాధితులు మందులతోపాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు. ఇవి ప్రతి రోజూ తీసుకోవాల్సిందే. వీటితో నిత్యం ఇబ్బంది పడాల్సిందే. అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు కొందరు పరిశోధకులు చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. దీని ప్రకారం, మధుమేహులు ప్రతిరోజూ కాకుండా వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను కనుగొన్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్లతో షుగర్ బాధితులు పడుతున్న అవస్థలు చూసి పరిశోధకులు ఈ రీసెర్చ్ మొదలు పెట్టారు. చివరకు విజయం సాధించారు. ప్రతిరోజూ కాకుండా, వారానికోసారి మాత్రమే తీసుకునేలా "ఎఫ్సిటోరా" అనే కొత్తరకం ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను కనుగొన్నారు. షుగర్ పేషెంట్లు రోజూ తీసుకునే "డెగ్లూడెక్" ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరిగానే ఇది కూడా సురక్షితమని చెబుతున్నారు. మూడు ప్రయోగ పరీక్షల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రయోగంలో భాగంగా టైప్2 డయాబెటిస్తో బాధపడుతున్నవారికి "ఎఫ్సిటోరా" ఇంజక్షన్ ఇచ్చి, డెగ్లూడెక్‌తో పోల్చి చూశారు. ఇందులో "ఎఫ్సిటోరా" ఫలితాలు మరింత సక్సెస్ ఫుల్‌గా కనిపించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను "న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్" ప్రచురించింది. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ ప్రయోగంలో భాగంగా మొత్తం 928 మందిని 52 వారాల పాటు పరిశీలించారు. అప్పుడు 3 నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ మోతాదులు డెగ్లూడెక్‌తో 8.24% నుంచి 7.05 శాతానికి తగ్గినట్లు కనుగొన్నారు. అదే కొత్త ఇన్సులిన్ ఎఫ్సిటోరాతో 8.21% నుంచి 6.97 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా, డెగ్లూడెక్ తీసుకున్నవారిలో ఆరు సార్లు గ్లూకోజు మోతాదు మరీ తక్కువకు(హైపోగ్లైసీమియా) పడిపోయాయి. అదే ఎఫ్సిటోరాతో అలాంటి సంఘటనలేవీ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. కాబట్టి, డైలీ ఇన్సులిన్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి ఎఫ్సిటోరా మంచి ప్రత్యామ్నాయం కాగలదని, క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే - షుగర్ గా అనుమానించాల్సిందేనట!
అదేవిధంగా, మరో ప్రయోగ పరీక్షలో టైప్ 1 మధుమేహం గలవారి మీద డెగ్లూడెక్, ఎఫ్సిటోరా అనే రెండు ఇంజెక్షన్ల ప్రభావాలను పరిశీలించారు. అయితే, ఇవి రెండూ హెచ్‌బీఏ1సీని ఒకేలా తగ్గిస్తున్నప్పటికీ, డెగ్లూడెక్‌తో పోలిస్తే ఎఫ్సిటోరాతో ఎక్కువసార్లు హైపోగ్లైసీమియా తలెత్తినట్టు వెల్లడైంది. దాంతో పరిశోధకులు ఈ పరిస్థితిని తగ్గించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సఫలమైతే టైప్1 మధుమేహులకు కూడా వారానికోసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మూడో భోజనం అప్పుడు తింటే మీకు మూడినట్టే - షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువట!