Los Angeles Wildfire : అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఈ కార్చిచ్చు బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కు పెరిగింది. కాగా మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. తీవ్రమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యగా లాస్ ఏంజెలెస్ కౌంటీలోని 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని అన్నీ దగ్ధమయ్యాయని, ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా చాలా ఎక్కువని అధికారులు తెలిపారు. అయితే పాలిసేడ్స్ ఫైర్‌ను 11 శాతం, ఎటోన్ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కార్చిచ్చును అదుపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
హాలీవుడ్ స్టార్ల వల్లే నీటి కొరత!
హాలీవుడ్ స్టార్లు లాస్ ఏంజెలెస్‌లోని నీటి వనరులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీని వల్లనే ఇప్పుడు వేల ఇళ్లను మంటల బారి నుంచి కాపాడేందుకు వీలు లేకుండా, నీటి కొరత ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకొని తమ తోటలను పెంచుతున్నారని డెయిలీ మెయిల్ కథనంలో పేర్కొంది.
నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్‌లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు, తనకు కేటాయించిన నీటి కంటే 2,32,000 గ్యాలన్లను అదనంగా వాడుకొన్నట్లు అధికారులు గుర్తించారు. కండల వీరుడు సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ లాంటి స్టార్లు కూడా అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి, ప్రైవేటు ఫైర్‌ఫైటర్లను నియమించుకున్నారు. కాగా పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలడంలేదని పేర్కొంది. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నట్లు తెలిపింది.