Iran President Helicopter Accident : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది.
ఇబ్రహీం రైసీ(63) ఆదివారం అజర్బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్‌ను ఆయన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్‌తో కలిసి ప్రారంభించాలన్నది ప్రణాళిక. అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కాగా, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్, ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ ఇతర అధికారులు రైసీతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం. కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు, పొగమంచు కురుస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. అయితే ఘటనాస్థలానికి చేరుకునేందుకు అవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా- రెస్క్యూ హెలికాప్టర్ కూడా అక్కడ ల్యాండ్ కాలేకపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు- ప్రమాద స్థలానికి సమీపంలో సాధారణ, ఎయిర్ అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. రైసీ ఉన్న హెలికాప్టర్‌లో కొందరు అధికారులు, భద్రతాసిబ్బంది కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు లోహవిహంగాలు సురక్షితంగా ల్యాండయ్యాయి.
1988లో జరిగిన రాజకీయ ఖైదీల సామూహిక హత్యల్లో రైసీ ప్రమేయం ఉందని అమెరికాతో పాటు పలు దేశాలు ఇబ్రహీం రైసీపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీం రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న తొలి ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ రికార్డు సృష్టించారు. అంతకుముందు వరకు దేశ న్యాయవ్యవస్థ అధిపతిగా పనిచేశారు రైసీ. ఆయన మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసత్వం గల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇందుకు గుర్తుగా ఆయన నల్లని తలపాగా ధరిస్తుంటారు. సర్వోన్నత నేతకు సన్నిహితుడన్న గుర్తింపు పొందారు. రైసీ జాడ తెలియరాకపోతే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ (69) ఆయన స్థానంలో తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ప్రధాని మోదీ స్పందన
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఈరోజు ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్ సంబంధించిన నివేదికల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ సమయంలో ఇరాన్ ప్రజలకు మేం సంఘీభావంగా ఉన్నాం. అధ్యక్షుడు, ఆయన సహచరుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం" అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.