Vegetables To Avoid During Monsoon :హమ్మయ్య వర్షాకాలం వచ్చేసింది, వేడి, ఉక్కపోత సమస్య పోయినట్టే అని అంతా రిలాక్స్‌గా ఫీలవుతున్నారు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందండీ. వేసవిలో ఎలా అయితే ఉక్కపోత, వేడి, వడ దెబ్బ లాంటి సమస్యలున్నాయో, వర్షకాలంలో కూడా అలాగే రకరకాల వ్యాధుల ముప్పు ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాకరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ఆహార పరిశుభ్రత లోపించి అనారోగ్యం పెరుగుతుంది. అందుకే వర్షకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ కాలంలో కొన్ని వెజిటేబుల్స్‌లో తేమ కీటకాలు, బ్యాక్టీరియాలు ఎక్కువయి జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. వర్షాకాలంలో దూరంగా ఉండాల్సిన ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలకు తీసుకోకుండా ఉండటం మంచిది. వర్షాకాలంలో ఈ కూరగాయల్లో తేమ అధికంగా ఉండి వాటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. వీటిని తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు ఏర్పడి, జీర్ణసమస్యలు తలెత్తుతాయి.
వర్షకాలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, బ్రెసెల్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలకు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. వీటిలో పోషక విలువలు ఎక్కువ ఉన్నప్పటికీ అధిక తేమ కారణంగా ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తగినంత శుభ్రత లేకుండా వీటిని తినడం వల్ల కాలుష్య ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, టర్నిప్ వంటి రూట్ వెజిటేబుల్స్‌ను కూడా వర్షాకాలంలో తినడం మానేయాలి. తప్పదు తినాలి అనుకుంటే వీటిని శుభ్రంగా కడుక్కుని ఉడికించుకుని తినడం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో నేలలో అధిక తేమ కారణంగా ఈ కూరగాయలు ఎక్కువ నీటిని పీచ్చుకుంటాయి. ఫలితంగా అవి త్వరగా కుళ్లిపోవడం లేదా పాడైపోవడం వంటివి జరుగుతాయి. అలా అని వీటిని ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచడం కూడా మంచిది కాదు.