Cabbage Farmer Success Story : క్యాబేజీ సాగుతో లాభాలు పండించి అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు ఓ రైతు. కర్ణాటకలోని బెళగావి పరిధిలోని కడోలి గ్రామానికి చెందిన రైతు నగేశ్ చంద్రప్ప దేశాయ్ పట్టుదలతో శ్రమంచి తన భాగ్యరేఖను మార్చుకున్నారు. ఇప్పుడు ఇల్లు, బైక్, చివరకు పెళ్లి పత్రికపైనా "ఆల్ థ్యాంక్స్ టు క్యాబేజీ" అని ఆయన రాసుకుంటున్నారు.
ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేసింది
కడోలి గ్రామానికి చెందిన నగేశ్ చంద్రప్ప దేశాయ్ పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. నగేశ్‌కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తొలినాళ్లలో అందులో చెరుకు, బంగాళాదుంపలు, వరి వంటి పంటలను సాగు చేసేవారు. అయితే వాటి వల్ల అంతగా ఆదాయం వచ్చేది కాదు. పంట సాగు చేసిన ప్రతిసారి అప్పులు మాత్రం మిగిలేవి. 2010 సంవత్సరంలో నగేశ్ చంద్రప్ప తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఇక నుంచి క్యాబేజీ సాగుపై ఫోకస్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్లలో క్యాబేజీ సాగులో నగేశ్ రూ.1 కోటికిపైగా సంపాదించడం విశేషం.

2 ఎకరాల భూమి- సొంత ఖర్చులతో పెళ్లి
క్యాబేజీ సాగు ద్వారా సంపాదించిన లాభాలతో నగేశ్ తన అప్పులను తీర్చేశారు. రూ.80 లక్షలతో అదనంగా మరో 2 ఎకరాల భూమిని కొన్నారు. సొంత ఖర్చులతో తన పెళ్లిని కూడా చేసుకున్నారు. అంతేకాదు, తన సోదరి, సోదరుడి పెళ్లిళ్లను సైతం నగేశ్ జరిపించారు. తొమ్మిదేళ్ల క్రితం రూ.6.50 లక్షలు ఖర్చుపెట్టి తన పొలంలో ఒక ఇంటిని నగేశ్ నిర్మించారు. ఇప్పుడు ఆ ఇంటిపై "ఆల్ థ్యాంక్స్ టు క్యాబేజ్" అనే నినాదాన్ని ఆయన రాయించారు. తన బైక్‌పైనా అదే స్లోగన్ రాయించారు.
నర్సరీ ఏర్పాటు- తగ్గిన సాగు వ్యయం
తన భూమిలోని 2 గుంటల స్థలంలో ఒక నర్సరీని నగేశ్ నిర్వహిస్తున్నారు. తన క్యాబేజీ సాగును మరింత ఫలవంతంగా మార్చేందుకు ఈ నర్సరీని ఒక ప్రయోగ వేదికలా వాడుకుంటున్నారు. క్యాబేజీ నారును బయట కొనుగోలు చేస్తే డబ్బులు ఖర్చవుతాయి. ఒక్కో నారుకు 60 పైసల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. నగేశ్ నర్సరీలో కేవలం 20 పైసలకే ఒక్కో క్యాబేజీ నారు తయారవుతోంది. దీనివల్ల ఆయన సాగు ఖర్చులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

క్యాబేజీ సాగు ఇలా
వరి సాగు సీజన్ ముగిసిన తర్వాత, క్యాబేజీ సాగు కోసం పొలాన్ని నగేశ్ సిద్ధం చేస్తారు. ఇందుకోసం ఎకరానికి దాదాపు 40వేల చొప్పున క్యాబేజీ నారులను సిద్ధం చేసుకుంటారు. ఈ పంట చేతికొచ్చే వరకు ఐదు నుంచి ఆరుసార్లు క్రిమిసంహారకాలను పిచికారీ చేయాలి. మూడుసార్లు ఎరువులు వేయాలి. ఎనిమిది రోజులకోసారి పంటకు నీళ్లు పెట్టాలి. మూడు నెలల్లోనే ఎకరాకు దాదాపు 25 టన్నుల నుంచి 30 టన్నుల దాకా క్యాబేజీ దిగుబడి వస్తుంది. బెంగళూరు, ఘటప్రభ, బెళగావి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నేరుగా నగేశ్ పొలానికి వచ్చి క్యాబేజీని కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ రేటు ప్రకారమే తన పంటను ఆయన విక్రయిస్తుంటారు.
రూ.20వేలు నష్టం- రూ.7 లక్షల లాభం
క్యాబేజీ ధరలు స్థిరంగా ఉండవు. అవి ఎప్పుడు, ఎలా మారుతాయో ముందే అంచనా వేయలేం. ప్రస్తుతం కర్ణాటకలో క్యాబేజీ ధర 10 కేజీలకు కేవలం రూ.15 మేర ఉంది. దీనివల్ల నగేశ్‌కు ఎకరాకు దాదాపు రూ.20వేల దాకా నష్టం వచ్చింది. అయితే రెండేళ్ల క్రితం 10 కేజీల క్యాబేజీకి ఏకంగా రూ.250 వరకు రేటు పలికింది. అప్పట్లో నగేశ్‌కు ఎకరాకు రూ.7 లక్షల వరకు లాభం వచ్చింది. ఈ విధంగా ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చినా, క్యాబేజీ సాగును నగేశ్ వదల్లేదు. నగేశ్‌కు క్యాబేజీ సాగులో ఉన్న నిబద్ధతను చూసి స్థానికులు క్యాబేజ్ నాగన్న అని పిలుస్తున్నారు. నగేశ్‌కు వ్యవసాయం చేయడంలో అతడి భార్య ప్రియ, సోదరుడు కలప్ప సహాయం చేస్తుంటారు. కలప్ప బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

మేం ఇప్పుడు కోటీశ్వరులం : నగేశ్ చంద్రప్ప దేశాయ్
"క్యాబేజీ సాగు మా కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసింది. మేం ఇప్పుడు కోటీశ్వరులం. అందుకే మా ఇల్లు, పాత్రలు, ప్రతీదానిపై ఆల్ థ్యాంక్స్ టు క్యాబేజ్ అని రాసుకున్నాం" అని ఈటీవీ భారత్‌తో చెప్పుకొచ్చారు నగేశ్.