Indian Railway Tatkal Ticket Booking Rules: దూరం, సౌకర్యవంతమైన జర్నీలు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది రైలు. అందుకే నిత్యం లక్షల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఇక రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాంటి వారందరికీ గుర్తొచ్చేది తత్కాల్. అయితే ఈ తత్కాల్ టికెట్లు పొందడం అంత సులభం కాదు. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. కొంతమంది తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లను బుక్ చేస్తుంటారు. అసలు తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అలాచేస్తే కన్ఫర్మ్ అవ్వడానికి ఎంతమేరకు అవకాశాలుంటాయనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అనుకోని ప్రయాణాలు చేసే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే రిజర్వేషన్ కోచ్‌లలో కొన్ని సీట్లను తత్కాల్ కోటాకు కేటాయిస్తోంది. అయితే ఈ టికెట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ప్రయాణానికి ఒకరోజు ముందు తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో చాలా మంది తత్కాల్ టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ ఎదురుచూస్తుంటారు. తీరా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత కేవలం నిమిషాల్లోనే టికెట్లు బుక్ అయిపోతుంటాయి. దీంతో కొంతమంది తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లను బుక్ చేస్తుంటారు. సాధారణంగా తత్కాల్‌లో పది నుంచి పదిహేను నెంబర్లలో వెయిటింగ్ లిస్ట్ ఉంటే కన్ఫర్మ్ అవుతాయనే ఆశతో టికెట్లు బుక్ చేస్తుంటారు. తీరా చార్ట్ తయారైన తర్వాత టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఎంతో నిరాశ చెందుతారు. కొంతమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే మరికొందరు జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మరికొంతమంది బస్సులో వెళ్లేందుకు చూస్తారు.
తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చా: సాధారణ వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో పోలిస్తే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఒక రైలులోని మొత్తం టికెట్లలో ఎక్కువమొత్తం టికెట్లను జనరల్ కేటగిరికి కేటాయిస్తారు. కొన్ని సీనియర్ సిటిజన్, మరికొన్ని మహిళా కోటాకు కేటాయించి, కొన్నింటిని తత్కాల్ కోటా కోసం పెడతారు. మరికొన్ని బెర్తులను ఈక్యూ కోసం కేటాయిస్తారు.
ఎవరైనా సాధారణ కోటాలో రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుంటే, అందులో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా సీనియర్ సిటిజన్, మహిళలకోటాతో పాటు ఈక్యూలో బెర్తులు మిగిలిపోతే, వాటిని కూడా సాధారణ కోటాలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికే కేటాయిస్తారు. సాధారణ కోటాలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు కేటాయించిన తర్వాత మిగిలితే టికెట్లను మాత్రమే తత్కాల్ కోటాలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి కేటాయిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు తొలి ప్రాధాన్యత ఇస్తారని భావిస్తుంటారు. కానీ సాధారణ కోటా ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే, తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికి బెర్తులు కేటాయిస్తారు.
అవకాశాలు ఎప్పుడంటే: తత్కాల్ వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ దాదాపుగా ఉండవని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి అదికూడా ఒకటీ, రెండు టికెట్లు కన్ఫర్మ్ అవ్వడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అయినవాళ్లు క్యాన్సిల్ చేసుకుంటేనే, అక్కడ వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. సాధారణంగా అత్యవసరం ఉన్నవారే తత్కాల్ టికెట్ తీసుకుంటారు కాబట్టి, అవి రద్దు చేసుకునే వారు దాదాపుగా ఉండరని చెబుతున్నారు. అందుకే తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటే తీసుకోకపోవడమే బెటర్ అని అంటున్నారు.
అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లాలా? 'తత్కాల్ పాస్‌పోర్ట్' కోసం అప్లై చేసుకోండిలా!
రైలు ప్రయాణంలో ఇబ్బందులా? - ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే చిటికెలో సాల్వ్